విలీన దిశలో సప్తగిరి బ్యాంకు
ABN , Publish Date - May 01 , 2025 | 01:57 AM
రాష్ట్రంలో గురువారం నుంచి బ్యాంకుల విలీనంతో జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు కనుమరుగుకానుంది. రాష్ట్రంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు సహా నాలుగు బ్యాంకులు పనిచేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు సేవలు యథాతఽథం
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురువారం నుంచి బ్యాంకుల విలీనంతో జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు కనుమరుగుకానుంది. రాష్ట్రంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు సహా నాలుగు బ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిని విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. అయితే బ్యాంకు విలీనం ద్వారా ఖాతాదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వారి ఖాతా విలీన బ్యాంకు నుంచి ప్రధాన బ్యాంకుకు మారుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ యథావిధిగా కొనసాగుతుంది.బ్యాంకు పేరు మాత్రమే మారుతుంది. పాత చెక్‌బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డులు, ఐఎ్‌ఫఎ్‌ససి కోడ్, బ్రాంచ్ కోడ్ తదితర సౌకర్యాలు యథాతధంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 50శాతం వాటా ఉంది. మరో 35 శాతం స్పాన్సర్ బ్యాంకు, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా కొనసాగుతుంది. 1981లో శ్రీవెంకటేశ్వరా గ్రామీణ బ్యాంకు పేరిట ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నరైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారికి రుణాలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రుణాలు అందించే కార్యక్రమం చేపట్టింది. అనంతరం శ్రీవెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు కృష్ణా జిల్లా గుడివాడ కనకదుర్గ గ్రామీణ బ్యాంకు విలీనంతో సప్తగిరి గ్రామీణ బ్యాంకుగా 2006 జూన్ 1న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది.చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, కృష్ణాజిల్లాల్లో బ్యాంకుకు 246 శాఖలు ఉన్నాయి. 2025 మార్చి 31 నాటికి రూ. 386.68 కోట్లు నికర లాభాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు గడించింది. రూ.26,771.53 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండగా, డిపాజిట్ల రూపంలో రూ.13,527.59 కోట్లు, రుణాల కింద 13,243.94 కోట్లు వితరణ చేసింది. జిల్లాలవారీగా చిత్తూరులో 68, ఎన్టీఆర్ జిల్లాలో 52, తిరుపతిలో 47, కృష్ణాలో 36, అన్నమయ్యలో 31, ఏలూరులో 12 శాఖలతో బ్యాంకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇండియన్ బ్యాంకు స్పాన్సర్డ్ బ్యాంకుగా ఉంది. ఇకపై అమరావతిలో ప్రధాన కార్యాలయం, చిత్తూరులో ప్రాంతీయ కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించనుంది. ఇందులో 300 మంది బిజినెస్ కరెస్పాండెంట్లు పనిచేస్తుండగా, 20 లక్షల మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. కాగా ప్రస్తుతం బ్యాంకు చైర్మన్‌గా 2021 ఆగస్టు 23 నుంచి కొనసాగుతున్న ఏఎ్‌సఎన్ ప్రసాద్ బుధవారం మాతృసంస్థ ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లారు.