Share News

ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లకు మోక్షం..?

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:41 AM

నిబంధనల మేరకు ఫ్రీహోల్డ్‌ చేసిన భూములకు మాత్రమే రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నట్లు సమాచారం. ఈ విషయమై అధ్యయనానికి నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో సక్రమంగా జరిగిన 53,917.8 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు మాత్రమే రిజిస్ర్టేషన్లు కానున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించడంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అక్రమాలను నిగ్గు తేల్చింది. జిల్లాలో మొత్తం 1,59,327.5 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌గా మార్చగా, వాటిలో 1,05,409.7 ఎకరాలను అక్రమంగా చేసుకున్నట్లు తేలింది. దీంతో మొత్తం 1,59,327.5 ఎకరాల రిజిస్ర్టేషన్లనూ ప్రభుత్వం నిలిపేసింది.

ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లకు మోక్షం..?
ఫ్రీ హోల్డ్‌ భూమి

  • అక్రమ ఫ్రీ హోల్డ్స్‌ మళ్లీ నిషిద్ధ జాబితాలోకే

  • నిబంధనల మేరకు చేసిన భూములకే క్లియరెన్సు

  • అక్రమాలకు పాల్పడిన అధికారులపైనా చర్యలు

చిత్తూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : నిబంధనల మేరకు ఫ్రీహోల్డ్‌ చేసిన భూములకు మాత్రమే రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నట్లు సమాచారం. ఈ విషయమై అధ్యయనానికి నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో సక్రమంగా జరిగిన 53,917.8 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు మాత్రమే రిజిస్ర్టేషన్లు కానున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించడంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అక్రమాలను నిగ్గు తేల్చింది. జిల్లాలో మొత్తం 1,59,327.5 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌గా మార్చగా, వాటిలో 1,05,409.7 ఎకరాలను అక్రమంగా చేసుకున్నట్లు తేలింది. దీంతో మొత్తం 1,59,327.5 ఎకరాల రిజిస్ర్టేషన్లనూ ప్రభుత్వం నిలిపేసింది.

అసలైన లబ్ధిదారుల్లో వ్యతిరేకత

అక్రమ ఫ్రీ హోల్డ్‌ భూములను ఏం చేయాలి? అక్రమార్కులకు పహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం, కమిటీలను ఏర్పాటు చేసింది. అక్రమ ఫ్రీహోల్డ్‌లపై, అధికారులపై చర్యలు తీసుకోకుండానే ఏడాది గడిచిపోయింది.దీంతో క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో సక్రమంగా ఫ్రీహోల్డ్‌ అయిన భూములకు మాత్రం క్లియరెన్సు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఫ్రీహోల్డ్‌ భూముల వివరాలు (ఎకరాల్లో)

- ఫ్రీహోల్డ్‌ చేసిన మొత్తం భూములు: 1,59,327.5

- అక్రమంగా చేసినవి: 1,05,409.7

- నిబంధనల మేరకు చేసినవి: 53,917.8

ఫ అక్రమాలు జరిగాయిలా..

20 ఏళ్ల గడువు ముగియకున్నా, క్షేత్రస్థాయిలో భూమికి లబ్ధిదారులు లేకున్నా, ఇతర ఉల్లంఘనలు జరిగినా.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వేల ఎకరాల అసైన్డ్‌ భూములను గత ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తప్పించేసింది. ఈ క్రమంలో భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలడం.. దానికి తోడు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దగ్ధం కావడం.. వంటి కారణాలతో గత ఆగస్టు నుంచి ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లను ప్రభుత్వం నిలిపేసింది.

పలు మండలాల్లో పెద్దఎత్తున అక్రమాలు

రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ అక్రమాలుఔ జరిగిన టాప్‌ 10 మండలాలను ప్రభుత్వం విడుదల చేస్తే 4, 5, 10 స్థానాల్లో వి.కోట, కుప్పం, బంగారుపాళ్యం మండలాలు నిలిచాయి. వి.కోట మండలంలో మొత్తం 12,226 ఎకరాల డీకేటీని ఫ్రీహోల్డ్‌ భూములుగా మార్చితే.. వాటిలో అత్యధికంగా 9,243 ఎకరాలు అక్రమమని తేలాయి. అలాగే కుప్పం మండలంలో 8674 ఎకరాల్ని ఫ్రీహోల్డ్‌ చేస్తే, 8400 ఎకరాలు అక్రమంగా చేశారు. బంగారుపాళ్యంలో 8042 ఎకరాల్లో 7198 ఎకరాలు అక్రమమే. ఈ మూడు మండలాలతో పాటు చిత్తూరు అర్బన్‌, గుడిపాల, తవణంపల్లె, ఐరాల, గుడుపల్లె వంటి మండలాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి.

1.05 లక్షల ఎకరాలు మళ్లీ డీకేటీలుగా..

జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్ని అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటితో పాటు సక్రమంగా జరిగిన భూమినీ హోల్డ్‌లో పెట్టేసింది. ప్రస్తుతం నిబంధనల మేరకు జరిగిన భూములకు క్లియరెన్సు ఇచ్చి, 1.05 లక్షల ఎకరాల్ని మళ్లీ డీకేటీలుగా మార్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఫ్రీహోల్డ్స్‌ విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన మండలాల్లో అప్పట్లో పనిచేసిన అన్ని స్థాయి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఆ పది మండలాల్లో అప్పట్లో పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Jul 01 , 2025 | 01:41 AM