రిజిస్ట్రేషన్ల జోరు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:45 AM
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిశాతం సైతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.221.88 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం రూ.149.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది.
గత ఏడాదితో పోలిస్తే 13.36 శాతం వృద్ధి
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిశాతం సైతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.221.88 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం రూ.149.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. నిర్దేశించిన మొత్తంలో 67.55 శాతం మాత్రమే లక్ష్యం చేరుకోగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలోనే రాబడి బాగా పుంజుకుంది.జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.106.90 కోట్లు రాబడి లక్ష్యం నిర్దేశించగా, రూ. 78.13 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగి 73.09 వృద్ధిశాతం సాధించింది. గత ఏడాది తొలి ఆరునెలల కాలంలో రూ.68.92 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. లక్ష్యంలో సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల వారీగా... కుప్పం రూ. 10.95 కోట్లకు బదులు రూ. 11.33 కోట్లతో 103.50 శాతం వృద్ధి సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో నిలిచిన నగరి రూ. 7.05 కోట్లకు బదులు రూ.7.10 కోట్లు (100.62 శాతం) సాధించింది. మూడో స్థానంలో చిత్తూరు రూరల్ రూ. 7.63 కోట్లకు గాను రూ.7.01 కోట్లు (91.95శాతం), పలమనేరు రూ.17.10 కోట్లకు గాను రూ.15.51 కోట్లు (90.66 శాతం), బంగారుపాళ్యం రూ.5.61 కోట్లకు గాను రూ.4.47 కోట్లు (79.74శాతం), పుంగనూరు రూ.15.08 కోట్లకు గాను రూ.9.67 కోట్లు (64.13 శాతం), కార్వేటినగరం రూ.5.33 కోట్లకు గాను రూ.2.90 కోట్లు (54.51 శాతం) సాధించగా, చిట్టచివరి స్థానంలో చిత్తూరు (అర్బన్) రూ.38.11 కోట్లకు గాను రూ.20.10 కోట్లు వసూలు చేసి 52.76 శాతంతో నిలిచింది. జిల్లాలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు గతనెలాఖరుకు 28,964 జరగ్గా, కుప్పంలో 6705 జరిపి ప్రథమ స్థానంలో నిలవగా, 4932తో పలమనేరు, 4812తో చిత్తూరు ఆర్వో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 1667 డాక్యుమెంట్లతో చిట్టచివరిస్థానంలో నగరి నిలిచింది. బంగారుపాళ్యంలో 1718, పుంగనూరులో 4182, కార్వేటినగరంలో 2033, చిత్తూరు రూరల్‌లో 2915 రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిత్యం జిల్లావ్యాప్తంగా రూ.45 లక్షల నుంచి రూ.55 లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో 13.36శాతం వృద్ధి నమోదయ్యింది. భూములు, స్థలాల మార్కెట్ విలువ పెంపు ద్వారా ఈ ఏడాది రూ.220 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌శాఖ అంచనా వేసింది.