Share News

సిలికా కోసం నిబంధనల ‘దారి’ తప్పారు!

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:50 AM

సిలికా తరలింపునకు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌తో రోడ్డు వేస్తున్నారు.

 సిలికా కోసం నిబంధనల ‘దారి’ తప్పారు!
ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు

ఆ మైన్‌ యజమాని చక్రం తిప్పారు. సిలికా తరలింపునకు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌తో రోడ్డు వేస్తున్నారు. తాను లీజుకు తీసుకున్న మైన్‌ నుంచి సిలికా తరలించడంతో పాటు.. ఈ దారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లో సిలికాను సొంతం చేసుకునే వ్యూహమూ దీని వెనుక దాగుందన్న ప్రచారం జరుగుతోంది. మొదట్లో నిబంధనల పేరిట అడ్డుకున్న అధికారులు.. వారం రోజులుగా రోడ్డు వేస్తుంటే పట్టించుకోకుండా ఉండటం పలు ఆరోపణలకు తావిస్తోంది.

- కోట, ఆంధ్రజ్యోతి

కోట మండలం కర్లపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 108లోని 8.5 ఎకరాల్లో.. గూడూరు ప్రాంతానికి చెందిన ఒకరికి సిలికా మైనింగ్‌కు అనుమతులున్నాయి. ఈ మైనింగ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే సర్వే నెంబరు 107లో 167 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిల్లో కొంతమంది గిరిజనులు నివాసం ఉండగా, మిగతా భూములు ఖాళీగా ఉన్నాయి. ఆ భూముల్లోనూ సిలికా ఖనిజ సంపద ఉంది. కాగా, గూడూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి.. తన మైన్‌ నుంచి సిలికా తరలించాలంటే దారి లేదు. పోనీ సిలికా యజమానుల సిండికేట్‌లో కలుద్దామంటే.. వాళ్లూ దారి సమస్యనే ప్రస్తావించినట్లు తెలిసింది. దీనికి ఏకైక పరిష్కారం.. ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేయడమే. దీంతో ఆ ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేయడానికి ఆ యజమాని ప్రయత్నించగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తన ప్రయత్నాలు ఆపేశారు. ఆ తర్వాత ఆయన కర్లపూడిలోని కొందరు దళిత, గిరిజనులను తనవైపు తిప్పుకొన్నారు. స్థానిక నాయకుల్లో కొందరితోను, అధికారులతోనూ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఆ రోడ్డు కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఆ దారితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోని సిలికానూ అనధికారికంగా తవ్వి తరలించే వ్యూహంతోనూ సిండికేట్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, వారంరోజులుగా ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేస్తున్నా ఏ శాఖ అధికారులూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ రోడ్డు కోసం సహజసిద్దంగా ఏర్పడి కర్లపూడి.. చిల్లకూరు మండలంలోని వేళ్లపాళెం, కాకువారిపాళెం చెరువుల్లోకి నీటి సరఫరా అయ్యే సొనకాలువలనూ పూడ్చివేస్తున్నారు. దీనివల్ల ఆయా చెరువుల పరిధిలోని తమ ఆయకట్టుకు సాగునీరు అందకుండా పోతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆ దారికి ఎలాంటి అనుమతుల్లేవు

కర్లపూడిలోని సిలికా భూములకు దారికి సంబంధించి ఎలాంటి అనుమతుల్లేవు. అక్రమ మార్గంలో పనులు జరుగుతుంటే తక్షణ చర్యలు చేపడతాం. దీనిపై తక్షణ విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తాం.

- జయజయరావు, కోట తహసీల్దారు

Updated Date - Sep 03 , 2025 | 12:50 AM