డ్రైన్లు, తాగునీటి కోసం రూ.80కోట్లు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:10 AM
తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో తిరుపతిలో డ్రైన్లు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనికోసం రూ.80కోట్లు కేటాయించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.
- తిరుపతి మున్సిపల్, తుడా అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ
తిరుపతి, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి) : తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో తిరుపతిలో డ్రైన్లు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనికోసం రూ.80కోట్లు కేటాయించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం రాత్రి తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ, తుడా అధికారులతో సమావేశమయ్యారు. కమిషనర్ మౌర్య కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. డ్రైన్లు లేని ప్రాంతాలను అడిగి తెలుసుకుని వాటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చుతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. రోడ్ల శుభ్రత కోసం మిషన్లపై ఆధారపడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. తుడా వీసీ శుభం బన్సల్ తుడా ప్రగతిని వివరించారు. శెట్టిపల్లిలో తుడాకు రావాల్సిన 65 ఎకరాలతో పాటు రెవెన్యూ వాటా 90 ఎకరాలు కూడా తుడాకు వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు మంత్రి చెప్పారు. తుడా టవర్స్‌లో ప్లాట్లు మందకొడిగా అమ్ముడుపో తున్నాయని, ధర సవరణపై కమిటీని నియమించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరంలో ప్రాధాన్యత పనులు పూర్తయిన వెంటనే సీవోసీ బిల్డింగ్ పూర్తి చేస్తామన్నారు. తిరుమల వర్షపునీరు మళ్లింపుపైనా చర్యలు తీసుకుంటామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాపు, బీసీ భవన్‌లను పూర్తిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీజీబీసీ చైర్మన్ సుగుణమ్మ, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్‌బాబు పాల్గొన్నారు.