Share News

తలకోన ఆలయానికి రూ.14.10 కోట్లు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:06 AM

తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయం రెండో దశ నిర్మాణ పనుల కోసం రూ.14.10 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

తలకోన ఆలయానికి రూ.14.10 కోట్లు
టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో సింఘాల్‌, సభ్యులు, అధికారులు

తిరుమల, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయం రెండో దశ నిర్మాణ పనుల కోసం రూ.14.10 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. తొలిదశలో రూ. 4 కోట్లు మంజూరు చేయగా, ఇప్పుడా మొత్తాన్ని భారీగా పెంచారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో అదనంగా 270 హాస్టల్‌ సీట్లు పెంచాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ 2,100 హాస్టల్‌ సీట్లున్నాయి. మంగళవారం తిరుమలలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుపతిలో టీటీడీ ఇప్పటికే నిర్వహిస్తున్న రోడ్లు, వీధిదీపాల బాధ్యతలు కొనసాగించాలని తీర్మానించారు.

ఫ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమల్లో ఉన్న మఽధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలల్లో డే స్కాలర్లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు.

టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యాసంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌ రూములు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, దానికి అవసరమైన సాఫ్ట్‌వేరు, సిబ్బంది వంటి సౌకర్యాల కల్పనకు ఆమోదం తెలిపారు.

తిరుమలలో పేర్ల మార్పునకు కమిటీ

తిరుమలలోని దారులు, రోడ్లు, ప్రధాన కూడళ్లు, ప్రాంతాల పేర్ల మార్పునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. ఈ కమిటీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ చక్రవర్తి రంగనాథన్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ మేడసాని మోహన్‌, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ కృష్ణమూర్తి ఉంటారు. వీరు రూపొందించిన జాబితాలోంచి పేర్లను ఎంపిక చేసి ఆయా ప్రాంతాలకు పెడతారు.

అనుబంధ ఆలయాల్లోని అర్చకుల జీతాలు పెంపు

టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటువర్కర్లు, ప్రసాద డిస్ర్టిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అర్చకులకు రూ.25 వేల నుంచి రూ.45 వేలకు, పరిచారకులకు రూ.23,140 నుంచి రూ.30 వేలకు, పోటువర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30 వేలకు, ప్రసాదం డిస్ర్టిబ్యూటర్లకు రూ.23,640 నుంచి రూ.30 వేలకు పెంచుతూ చేసిన ప్రతిపాదనను పాలకమండలి ఆమోదించింది.

Updated Date - Dec 17 , 2025 | 12:06 AM