తిరుపతిలో కోర్టు కాంప్లెక్సుకు రూ.115.12 కోట్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:27 AM
తిరుపతిలో కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.115.12 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి రూరల్ మండలం దామినేడులో కోర్టు భవనాల సముదాయం కోసం ప్రభుత్వం ఇటీవల 14 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే.
తిరుపతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.115.12 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి రూరల్ మండలం దామినేడులో కోర్టు భవనాల సముదాయం కోసం ప్రభుత్వం ఇటీవల 14 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుపతి నగరం వేశాలమ్మ గుడి వీధిలోని కోర్టు కాంప్లెక్సు తక్కువ స్థలంలో ఏర్పాటైంది. అందులో పలు భవనాలు బ్రిటిష్ కాలం నాటివి కావడంతో శిధిలావస్థకు చేరాయి. వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలంలేదు. దీంతో కోర్టుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపధ్యాన్ని వివరిస్తూ దామినేడులో కొత్తగా కేటాయించిన 14 ఎకరాల్లో నూతన కోర్టు సముదాయం నిర్మించాల్సి ఉంది. దీనికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) ఈ ఏడాది జూలై 5, సెప్టెంబరు 11, 20 తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం సీఎ్‌సఎస్ పథకం (న్యాయ శాఖకు మౌళిక సదుపాయాల కల్పన) కింద రూ. 115.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దామినేడులో 16 భవనాలతో కూడిన కోర్టు సముదాయం నిర్మించేందుకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది.