తోటల్లోనే కుళ్లిపోతున్న టమోటా
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:13 AM
పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టపోతున్నామని సోమల మండల టమోటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గార్గేయనదీ తీరంలోని రెడ్డివారిపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, పొలికిమాకులపల్లె గ్రామాల రైతులు టమోటాలను పుంగనూరు,పలమనేరు మార్కెట్లకు తరలించలేక నష్టపోతున్నారు.
సోమల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టపోతున్నామని సోమల మండల టమోటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గార్గేయనదీ తీరంలోని రెడ్డివారిపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, పొలికిమాకులపల్లె గ్రామాల రైతులు టమోటాలను పుంగనూరు,పలమనేరు మార్కెట్లకు తరలించలేక నష్టపోతున్నారు.వర్షాలతో నాలుగు కల్వర్టులు కొట్టుకుపోవడంతో టమోటాలను తరలించలేక పోతున్నారు. దీంతో టమోటాలు తోటల్లోనే కాయలు కుళ్లి పోతున్నాయి.దీనికితోడు వర్షాలతో నల్ల మచ్చ వ్యాధి సోకి పంటనష్టం జరుగుతోంది. ఒకటి రెండుసార్లు కోతలు చేసినా ఆకులు రాలిపోతున్నాయి. ధరలు కూడా తగ్గిపోయాయి. 15 కిలోల బాక్సు రూ.150 నుంచి రూ. 200 లోపు మాత్రమే పలుకుతున్నాయి. పెద్దఉప్పరపల్లె, నెల్లిమంద. ఇరికిపెంట, నడింపల్లె, కందూరు ప్రాంతాల్లో టమోటా సాగు అధికంగా ఉన్నా.. పెట్టుబడులు సైతం చేతికందే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి రైతులు కూడా వాన కారణంగా కోత కోయలేకపోతున్నారు. పలుచోట్ల వరి పంట నీటమునిగి కుళ్లిపోతోంది. కొందరు ఒబ్బిళ్లు చేసినా పంటను రక్షించుకోలేకపోతున్నారు.వరి మొలకలు వస్తున్నాయని ఆందోళన పడుతున్నారు.వేరుశనగ పంట కూడా పొలాల్లోనే మొలక వస్తోంది. ఇతర తీగ పంటలు, కూరగాయల పంటలకు కూడా నష్టమే వస్తోందని రైతులు వాపోతున్నారు.