Share News

గరుడ వాహనమెక్కి..

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:09 AM

దిగ్గున వెలిగే దీపకాంతులు.. హోరెత్తే గోవిందలు.. గిరిజన నృత్య విన్యాసాలు.. జతగా వాయిద్యాల ఘోష.. ‘ఇటు గరుడని నీవెక్కినను.. పటపట దిక్కులు బగ్గన పగిలె’ అని అన్నమయ్య వర్ణించినట్టుగానే ఆదివారం రాత్రి తిరుమల కొండమీద గరుడోత్సవం సాగింది.

గరుడ వాహనమెక్కి..

దిగ్గున వెలిగే దీపకాంతులు.. హోరెత్తే గోవిందలు.. గిరిజన నృత్య విన్యాసాలు.. జతగా వాయిద్యాల ఘోష.. ‘ఇటు గరుడని నీవెక్కినను.. పటపట దిక్కులు బగ్గన పగిలె’ అని అన్నమయ్య వర్ణించినట్టుగానే ఆదివారం రాత్రి తిరుమల కొండమీద గరుడోత్సవం సాగింది. మాడవీధులు భక్తజన సముద్రంగా భాసిల్లాయి. లక్ష్మీకాసుల హారం ధరించిన శ్రీనివాసుడు తన ఇష్టవాహనమైన గరుడుడిని అధిరోహించి గజ, వృషభ దళాలు ముందు నడుస్తుండగా మందగమనంతో విహరించాడు. రాత్రి నుంచే చలిని లెక్కచేయకుండా గ్యాలరీ మెట్లనే పడకలుగా మార్చుకున్న భక్తులు.. పగటి ఎండకు దుప్పట్లకింద తలదాచుకుని గరుడుడిపై ఊరేగుతూ వచ్చే స్వామికోసం ఎదురు చూశారు. ప్రకటించిన సమయంకన్నా 23 నిమిషాల ముందే గరుడవాహన సేవ మొదలైంది. ఉండి ఉండీ కురిసే జల్లుల నడుమ మాడవీధుల్లోని లక్షలాది భక్తజనానికి దర్శనమిస్తూ ముందుకు సాగింది.

సంతృప్తికరంగా మలయప్ప దర్శనం

మధ్యాహ్నం ఎండకు ఎండుతూ.. సాయంత్రం వర్షానికి తడుస్తూ గరుడ సేవలో మలయప్ప దర్శనానికి భక్తులు అత్యధిక సమయం గ్యాలరీల్లో వేచి ఉన్నారు. దీంతో గ్యాలరీలకు అతి సమీపంలోకి గరుడవాహనాన్ని తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించారు. గంటలకొద్దీ వేచిఉన్న భక్తులు కనువిందైన దర్శనంతో సంతృప్తిగా వెనుదిరిగారు. కళాబృందాలూ ఆరు గంటలపాటు నిరంతరాయంగా ప్రదర్శనలతో అలరించాయి. నాలుగు గజరాజులూ ఐదు గంటల పాటు స్వామి వాహనం ముందే నిలబడి సేవ చేశాయి.

23 నిమిషాల ముందే..

సాయంత్రం 6.30 గంటలకు గరుడ సేవ ప్రారంభిస్తామని టీటీడీ ప్రకటించింది. కానీ, ఉదయానికే గ్యాలరీలన్నీ నిండి మాడవీధులు రద్దీగా మారాయి. దీంతో నిర్ణీత సమయానికన్నా 23 నిమిషాల ముందే.. 6.07 గంటలకే వాహన సేవ ప్రారంభించారు. తొలుత బ్యాడ్జీలు కలిగిన వీఐపీలకు ఉత్సవమూర్తి దర్శనం చేయించి పంపారు. అనంతరం వాహనాన్ని ముందుకు నడిపారు.

2.40 లక్షల మందికి దర్శనం

ఉదయం 11 గంటలకంతా గ్యాలరీలు నిండటతో మాడవీధుల గేట్లను మూసేశారు. సాయంత్రం 4 గంటల సమయానికి 1.90 లక్షల నుంచి 2 లక్షల మంది గ్యాలరీల్లోకి చేరారని అధికారుల అంచనా. మరోవైపు కార్నర్‌ పాయింట్లు, రీఫిల్లింగ్‌ ద్వారా మరో 30 వేల నుంచి 35 వేల మంది దర్శనం చేసుకున్నారు. ఇలా, దాదాపు 2.40 లక్షల మందికి గరుడ సేవ దర్శనం లభించింది. మాడవీధుల వెలుపల దాదాపు 30 వేల నుంచి 40 వేల మంది ఉండొచ్చని, మూలవిరాట్టు దర్శనానికి కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, కృష్ణతేజ సర్కిల్‌ నుంచి అక్టోపస్‌ భవనం వరకు మరో 50 వేల మంది చొప్పున దాదాపు 3 లక్షల మందితో తిరుమల నిండిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మూలవిరాట్టు దర్శనానికి దాదాపు 36 గంటల సమయం పడుతుండటం గమనార్హం.

ఘటాటోపం తీసుకొచ్చే క్రమంలో తోపులాట

వాహన మండపం నుంచి గరుడ వాహనం ప్రారంభమై 7.20 గంటల సమయంలో మహద్వారం వద్దకు చేరుకుంది. అక్కడి హారతి పూర్తయ్యాక ముందున్న గేటు వద్దకు తీసుకొచ్చి నాదనీరాజనం వైపున్న భక్తులకు దర్శనం కల్పించే సమయంలో వర్షం మొదలైంది. వెనకున్న ఘటాటోపాన్ని వాహనం వద్దకు తీసుకొచ్చే సమయంలో కొంతమంది ఉద్యోగులు, భక్తులు దీంతో పాటు రావడంతో భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ బాలిక కింద పడిపోగా.. భద్రతాసిబ్బంది క్షణాల్లో ఆమెను పైకి లేపడంతో ప్రమాదం తప్పింది. వాహనం ముందూ వీఐపీల రద్దీ అధికంగా ఉంది. వాహనంతో పాటే ముందుకు నడుస్తున్న క్రమంలో సమయంలో కొంత గందరగోళం ఏర్పడింది.

24 గంటలకుపైగానే నిరీక్షణ

గరుడ వాహనంపై స్వామిని దర్శించుకునేందుకు 24 గంటలకుపైగానే భక్తులు నాలుగు మాడవీధుల్లో నిరీక్షించారు. శనివారం రాత్రి సర్వభూపాల వాహనసేవ కోసం మాడవీధుల్లోకి చేరిన పలువురు భక్తులు ఆదివారం రాత్రి నాటి గరుడసేవ కోసం అలానే ఉండిపోవడం గమనార్హం. టీటీడీ అందజేసే అన్నపానీయాలు స్వీకరిస్తూ గ్యాలరీల్లోని ఉండిపోయారు.

2.04 లక్షల మంది

- రాత్రి 11 గంటల వరకు ఆర్టీసీలో ప్రయాణం

గరుడ సేవ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు 2,04,090 మంది తిరుమల-తిరుపతి మధ్య ప్రయాణించారు. ఇందులో 1,05,040 మంది తిరుమలకు రాగా, 99,050 మంది కొండ దిగారు. 2011 రికార్డును ఈ ఏడాది అధిగమించడం గమనార్హం. ఆ ఏడాది 1,97,750 మంది భక్తులు అత్యధికంగా ప్రయాణించారు. తిరుమలలో పార్కింగ్‌ సమస్య నేపథ్యంలో మఽధ్యాహ్నం నుంచి ఇతర వాహనాలను ఆపేయడంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 01:09 AM