Share News

గజదాడులతో వరి రైతులు విలవిల

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:53 AM

ఏనుగుల దాడులతో వరి రైతులు విలవిల్లాడుతున్నారు. సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్టలోని రైతులు వరికోతలతో ఒబ్బిడి చేసి ఎర్రమిట్ట బండ, చింతలగుట్ట బండలపై ధాన్యం నిల్వ చేసి ఉన్నారు.

గజదాడులతో వరి రైతులు విలవిల
ఎర్రమిట్ట బండపై ఏనుగులు ధ్వంసం చేసిన ధాన్యం

సోమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏనుగుల దాడులతో వరి రైతులు విలవిల్లాడుతున్నారు. సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్టలోని రైతులు వరికోతలతో ఒబ్బిడి చేసి ఎర్రమిట్ట బండ, చింతలగుట్ట బండలపై ధాన్యం నిల్వ చేసి ఉన్నారు. ఆదివారం రాత్రి ఏనుగులు ఈ ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. మధురమలైకొండనే ఆవాసంగా చేసుకున్న ఏనుగులు పగలు అక్కడే ఉండి సాయంత్రం ఆరు గంటలకే పంటలపై దాడులు చేస్తున్నాయి. వాన తగ్గి ఎండ రావడంతో కోయంబత్తూరు నుంచి వచ్చిన వరి నూర్పిడి యంత్రాలకు గంటకు రూ.3,700 అధిక ధర చెల్లించి మరీ మూడ్రోజులుగా వరికోతలు చేపట్టారు. ఈ ధాన్యాన్ని బండలపై ఆరబెట్టగా ఏనుగులు నాశనం చేశాయని, టార్పాలిన్‌ పట్టలను సైతం చించేశాయని గొర్రెల చంద్ర, వి.వెంకట్రామనాయుడు, హుసేన్‌సాహెబ్‌, కె.రెడ్డెప్పనాయుడు, రఘు, వెంకటప్ప, రమణ, పార్వతీపురానికి చెందిన అలివేలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇరికిపెంటకు చెందిన డీలర్‌ చంద్రశేఖర్‌ నాయుడు పొలంవద్ద కొబ్బరి చెట్లను నేలమట్టం చేశాయి. వరిపంటను తొక్కేశాయని రైతులు తెలిపారు. ఏనుగుల సంచరించిన ప్రాంతాలను సోమవారం సోమల ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసులు నాయుడు, చెన్నపట్నం చెరువు నీటి సంఘ అధ్యక్షుడు గల్లా బోస్‌, ఎఫ్‌బీవో రాధ తదితరులు పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు చేపట్టారు.

Updated Date - Dec 16 , 2025 | 12:53 AM