Share News

తిరుపతిలో రెవెన్యూ దేవస్థానం

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:24 AM

అది ప్రభుత్వ కార్యాలయ ఆవరణ. ఒక మూలన చిన్న మందిరం రేకుల షెడ్డులో వెలిసింది. పనులపై వచ్చీపోయేవాళ్లు దణ్ణం పెట్టుకుంటారులే అనుకున్నారు. నిదానంగా అది ఆలయంగా మారిపోయింది. గుడి, గోపురం, ప్రాకారం, వాహన మండపం.. ఇలా ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో అన్ని హంగులూ ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా రోడ్డునూ, ప్రాకారం బయట ప్రాంతాన్నీ కూడా ఆక్రమించేస్తున్నారు. ఆలయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులో ఇదేమిటని అడిగేవాళ్లు మాత్రం లేకపోవడమే విచిత్రం.

తిరుపతిలో రెవెన్యూ దేవస్థానం
తిరుపతి అర్బన్‌ తహసీల్దారు కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయ రాజగోపురం

ఆ పేరుతో ఖరీదైన ప్రభుత్వ భూముల ఆక్రమణ

దారులు కూడా మూసేసి ఇష్టారాజ్యంగా నిర్వహణ

ఆలయ నిర్వహణకు చందాల వసూలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

అది ప్రభుత్వ కార్యాలయ ఆవరణ. ఒక మూలన చిన్న మందిరం రేకుల షెడ్డులో వెలిసింది. పనులపై వచ్చీపోయేవాళ్లు దణ్ణం పెట్టుకుంటారులే అనుకున్నారు. నిదానంగా అది ఆలయంగా మారిపోయింది. గుడి, గోపురం, ప్రాకారం, వాహన మండపం.. ఇలా ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో అన్ని హంగులూ ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా రోడ్డునూ, ప్రాకారం బయట ప్రాంతాన్నీ కూడా ఆక్రమించేస్తున్నారు. ఆలయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులో ఇదేమిటని అడిగేవాళ్లు మాత్రం లేకపోవడమే విచిత్రం.

తిరుపతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్‌ మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఓ చిన్నపాటి మందిరంగా నిర్మితమైన వెంకటేశ్వరస్వామి దేవాలయం పేరిట చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. తొమ్మిదేళ్ల వ్యవధిలో కార్యాలయ ఆవరణ మొత్తాన్నీ ఆక్రమించేసిన నిర్వాహకులు ఆపై ప్రహరీ దాటి వెలుపల కూడా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తహసీల్దారు కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు వెళ్లే దారులు సైతం మూసేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయం పేరిట వసూళ్లు చేస్తున్నారనిఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో బహిరంగంగా ఈ తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విచిత్రం.

ఐదు సెంట్లు హాంఫట్‌

తిరుపతి ఆలిండియా రేడియో కార్యాలయం వెనుకవైపు ఒకే ఆవరణలో తిరుపతి అర్బన్‌, రూరల్‌ మండలాల తహసీల్దారు కార్యాలయాలున్నాయి. వాటికి చుట్టూ ప్రహరీ కూడా ఉంది. ఆ కార్యాలయాలకు చుట్టూ అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. పలు శాఖల కార్యాలయాలున్నాయి. తహసీల్దారు కార్యాలయ ఆవరణలో వాయువ్య మూల పదేళ్ల కిందట వెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట చిన్న మందిరం నిర్మించారు. చూస్తుండగానే ఆ మందిరానికి చుట్టూ ప్రహరీ ఏర్పడింది. ఆపై ధ్వజస్తంభం, తర్వాత బలిపీఠం.. ఇలా అంతకంతకూ మందిరం ఆలయంగా ఆవిర్భవించింది. ఆవరణలో ఒక మూలకు పరిమితమైన మందిరం కాస్తా ఇపుడు ఆవరణ మొత్తాన్నీ ఆక్రమించేసింది. తహసీల్దారు కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు ఆవరణలో వేపచెట్టు, దానిచుట్టూ అరుగు ఉండగా ఆలయానికి అడ్డుగా ఉందని చెట్టును నరికివేయించి, అరుగు కూడా తొలగించేశారు. తాజాగా రాజగోపురం కూడా నిర్మించారు. రెండు సెంట్లలో ఉన్న మందిరం ఇప్పుడు ఐదు సెంట్లకు విస్తరించింది. కార్యాలయానికి జనం రాకపోకలను కూడా అసౌకర్యంగా మార్చేశారు. ఇదంతా ఆవరణలో సంగతి.

ఖరీదైన భూముల ఆక్రమణ

తహసీల్దారు కార్యాలయానికి వెలుపల ఉత్తర, పడమర దిశల్లో రోడ్లు, వాటిని ఆనుకునే అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. కార్యాలయం ముందు ఉత్తర దిశగా ఉన్న రోడ్డుకు శాశ్వతంగా రేకులతో పందిళ్లు వేసేశారు. రోడ్డుకు ఉత్తరంగా ఖాళీ స్థలంలో వాహన మండపం ప్రత్యక్షమైంది. పడమర ఖాళీ స్థలంలో కూడా వాహనాలు భద్రపరిచేందుకు, ఇతర వస్తువులు ఉంచేందుకు స్టోర్‌ రూమ్‌ వెలిశాయి. ఉత్తరంగా ఉన్న రోడ్డు ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు నుంచీ తహసీల్దారు కార్యాలయం మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ, జీఎస్టీ, డీఆర్‌డీఏ తదితర కార్యాలయాలతో పాటు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళుతుంది. ఉత్సవాల పేరిట తరచూ తహసీల్దారు కార్యాలయం వద్ద ఈ రోడ్డును మూసివేసి డైవర్ట్‌ చేస్తున్నారు. పడమర వైపు రోడ్డు యూత్‌ హాస్టల్‌, డ్వామా కార్యాలయాలతోపాటు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళుతుంది. 40 అడుగుల ఈ రోడ్డును సగం ఆక్రమించేశారు. ఉత్సవాల పేరిట ఆ రోడ్డును కూడా రోజుల తరబడీ మూసేస్తున్నారు. దీనిపై యూత్‌ హాస్టల్‌ అధికారులు పలుమార్లు అభ్యంతరం తెలిపినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అనుమతి లేకున్నా..

తిరుపతి అర్బన్‌ తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నిర్మితమై అంతకంతకూ విస్తరిస్తున్న ఆలయానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులూ లేవు. అయితే ఆలయ నిర్మాణానికి టీటీడీ నిధులు మంజూరయ్యాయనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ సంబంధిత పనులపై వచ్చే వారి నుంచి ఆలయం పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

Updated Date - Oct 12 , 2025 | 01:24 AM