Share News

విన్నపాలు.. వినవలె..

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:29 AM

పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అర్జీల పరిష్కారంలో జిల్లాకు ఆశించిన మేర స్థానం లభించలేదు. ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా నిరుద్యోగుల ఉద్యోగావకాశాల కల్పనలో మాత్రం జిల్లాకు మెరుగైన స్థానం లభించింది. వివిధ శాఖల పన్నుల వసూళ్లలోనూ దూకుడు ప్రదర్శించగలిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయార్జనలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది. మొత్తం మీద జిల్లా కొన్నింట ముందంజ వేస్తుండగా కొన్నింట మాత్రం మరింత పురోగతి కనబరచాలని స్పష్టమవుతోంది. అమరావతిలో గురువారం ముగిసిన కలెక్టర్ల సదస్సులో జిల్లాకు మిశ్రమ స్పందన లభించింది.

విన్నపాలు.. వినవలె..
కలెక్టరేట్‌లో ఈనెల 15వ తేదీన జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

  • అర్జీల పరిష్కారంలో అథమం.. జాబ్‌మేళాల్లో భళా

  • వివిధ శాఖల పన్ను వసూళ్లలో దూకుడు

  • కలెక్టర్ల సదస్సులో జిల్లాకు దక్కిన స్థానాలివి

పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అర్జీల పరిష్కారంలో జిల్లాకు ఆశించిన మేర స్థానం లభించలేదు. ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా నిరుద్యోగుల ఉద్యోగావకాశాల కల్పనలో మాత్రం జిల్లాకు మెరుగైన స్థానం లభించింది. వివిధ శాఖల పన్నుల వసూళ్లలోనూ దూకుడు ప్రదర్శించగలిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయార్జనలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది. మొత్తం మీద జిల్లా కొన్నింట ముందంజ వేస్తుండగా కొన్నింట మాత్రం మరింత పురోగతి కనబరచాలని స్పష్టమవుతోంది. అమరావతిలో గురువారం ముగిసిన కలెక్టర్ల సదస్సులో జిల్లాకు మిశ్రమ స్పందన లభించింది.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

58 జాబ్‌మేళాలు.. 2857 మందికి ఉద్యోగాలు

నియోజకవర్గాల్లో మూడు నెలలకోసారి జాబ్‌మేళా నిర్వహించాలనే ప్రభుత్వం సంకల్పం జిల్లాలో బాగానే నెరవేరుతోంది. ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 49 జాబ్‌మేళాలు నిర్వహించాల్సి ఉండగా 58 నిర్వహించారు. 337 కంపెనీలు పాలొనగా 2,857 మందికి ఉపాధి లభించింది.

అర్జీల పరిష్కారంలో జిల్లా వెనుకబాటు

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో ఆలస్యం జరుగుతున్నట్లు సదస్సులో గుర్తించారు. నిర్దేశిత గడువు దాటాక పరిష్కరించడంలో చిత్తూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర సగటు 1.86 శాతం. జిల్లా 7.27 శాతంగా ఉంది. తిరుపతి రెండో స్థానంలో (3.91 శాతం) ఉంది. అర్జీల రీ ఓపెన్‌లోనూ జిల్లా టాప్‌ మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర సగటు 8.72 శాతం అయితే, చిత్తూరుది 14.52 శాతంగా ఉంది. జాయింట్‌ ఎల్పీఎం అర్జీల తిరస్కరణలోనూ మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర సగటు 18.25 శాతంకాగా, జిల్లా 28.95 శాతంగా ఉంది. ఈ మూడు అంశాల్లో జిల్లా వెనుకబడి ఉంది.

‘కౌశలం’లో కాస్త తడబాటు

నిరుద్యోగులకు సర్వే నిర్వహించి, అవసరమైన వారికి స్కిల్‌ నేర్పించి ‘కౌశలం’ కింద ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది. జిల్లాలో డిగ్రీ ఆపైన చదువుకుని ఖాళీగా ఉన్నవారు 49,898 మందిని గుర్తించారు. స్కిల్‌ గుర్తింపు పరీక్షకు 18,965 మందికి 3,504 మంది మాత్రమే అంటే 18శాతం హాజరయ్యారు. ఇది రాష్ట్ర సగటు శాతం 20 కంటే తక్కువే. ఫ స్వామిత్వ సర్వేకు 300 రెవెన్యూ గ్రామాలు లక్ష్యంకాగా, 271 గ్రామాల్లో పూర్తి చేసి జిల్లా ఐదో స్థానంలో ఉంది. ఫ జిల్లాలో 4342 మంది సచివాలయ ఉద్యోగులు ఉండగా, 37492 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు.

లక్ష్యానికి మించి రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం

రిజిస్ర్టేషన్‌- స్టాంపుల శాఖ విడుదల చేసిన ఏప్రిల్‌-నవంబరు 2025 గణాంకాల ప్రకారం జిల్లా లక్ష్యానికి మించి ఆదాయం సాధించింది. లక్ష్యం రూ.107.98 కోట్లు కాగా, రూ.111.57 కోట్ల మేర ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.86.38 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చింది. అంటే ఈసారి రెవెన్యూ 29శాతం ఎక్కువగా సాధించింది. నంద్యాల, సత్యసాయి, కర్నూలు వంటి జిల్లాలు చిత్తూరు కంటే ఎక్కువగా లక్ష్యం దాటడంతో మన జిల్లా టాప్‌ స్థానంలో లేదు.

భారీగా తగ్గిన అక్రమ మద్యం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జిల్లాలో అక్రమ మద్యం విపరీతంగా తగ్గింది. ఫలితంగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు 10-15 శాతం పెరిగాయి. ఈ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది.

అక్రమ మద్యం కేసుల వివరాలు

గతేడాది జనవరి నుంచి

నవంబరు వరకు: 789

ఈ ఏడాది జనవరి నుంచి

నవంబరు వరకు: 197

తగ్గిన శాతం: 75

సీజ్‌ చేసిన మద్యం వివరాలు

అక్టోబరు 2023- నవంబరు

2024 వరకు: 13,864 లీటర్లు

అక్టోబరు 2024- నవంబరు

2025 మధ్య: 1644 లీటర్లు

తగ్గిన శాతం: 88

ఆస్తి పన్ను వసూళ్లలో సగటుకు మించి..

ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.45.42 కోట్ల లక్ష్యానికి రూ.24.29కోట్ల మేర వసూలైంది. అంటే 53.48 శాతం. రాష్ట్ర సగటు శాతం 51.43 శాతం కంటే జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. డిమాండ్‌ పెంపు, కొత్త అసె్‌సమెంట్ల విషయంలో.. రూ.5.92 కోట్లు జిల్లా లక్ష్యంకాగా, రూ.3.05 కోట్లు సాధించింది. ఈ రెండింటా వేగం పుంజుకోవాల్సి ఉంది.

గ్రామాల్లో రూ.4.23 కోట్ల ట్యాక్స్‌ వసూలు

గ్రామాల్లో పన్ను వసూళ్లలో జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17.60 కోట్ల మేర డిమాండ్‌ ఉండగా, ఇప్పటివరకు రూ.3.70 కోట్లు వసూలైంది. రూ.3.26 కోట్ల బకాయిలకు రూ.53 లక్షలు వసూలైంది. మొత్తంగా రూ.4.23కోట్లు వచ్చాయి. 20 శాతం వసూళ్లతో జిల్లా 5వ స్థానంలో ఉంది.

రూ.517.12 కోట్ల జీఎస్టీ వసూలు

జిల్లాలో 2024-25లోని నవంబరు వరకు రూ.611 కోట్ల జీఎస్టీ ట్యాక్స్‌తోపాటు మొత్తం రూ.626 కోట్ల ట్యాక్సులు (అన్నిరకాలు) వసూలయ్యాయి. గతనెల వరకు రూ.517.12కోట్ల జీఎస్టీ ట్యాక్స్‌తోపాటు మొత్తం రూ.546.25 కోట్ల వరకు అన్ని రకాల ట్యాక్సులు వసూలయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో గతేడాదితో పోల్చుకుంటే జిల్లా 15.43 శాతం వెనుకబడింది.

ఎల్‌ఆర్‌ఎస్‌, వాటర్‌ చార్జీలతో జిల్లాకు రూ.6.53 కోట్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌)కు సంబంధించి జిల్లాలో 628 దరఖాస్తులు రాగా, రూ.3.03 కోట్ల పెనాల్టీ వసూలైంది. ఈ విషయంలో జిల్లాలో రాష్ట్రంలో 21వ స్థానంలో ఉంది. ట్రేడ్‌ లైసెన్సుల నుంచి రూ.86 లక్షల వసూళ్లు లక్ష్యంకాగా, రూ.54లక్షలు వసూలు చేసి జిల్లా 17వ స్థానంలో నిలిచింది. రూ.17.52 కోట్ల వాటర్‌ చార్జీల వసూల లక్ష్యంలో రూ.3.49 కోట్లు మాత్రమే వసూలుచేసి 6వ స్థానంలో ఉంది.

చిత్తూరు పాత బస్టాండు అభివృద్ధికి ఆసక్తి

పీపీపీ విధానంలో చిత్తూరు పాత బస్టాండు అభివృద్ధికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాంతంలో బస్టాండుతోపాటు మార్కెట్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వంటివాటిని నిర్మించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనల్ని కోరుతోంది. చిత్తూరుతోపాటు నంద్యాల, కడప జిల్లాల్లో ఇదేవిధంగా రూ.150కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆహ్వానించింది.

సోలార్‌పై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు

రాష్ట్రంలో సోలార్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు అమలుపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌సహా అనకాపల్లె, కాకినాడ, ఏలూరు, అనంతపురం కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్న సబ్‌స్టేషన్లకు భూముల కేటాయింపు వేగవంతం చేయాలన్నారు. కాగా, రెండ్రోజులపాటు నిర్వహించిన సదస్సులో చివరి రోజున శాంతిభద్రతలపై జరిగిన సమీక్షకు ఎస్పీ తుషార్‌ హాజరయ్యారు.

Updated Date - Dec 19 , 2025 | 03:29 AM