తగ్గనున్న విద్యుత్ భారం
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:44 AM
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి రానుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈఆర్సీ సూచనతో కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరిట బిల్లుల భారాన్ని తగ్గిస్తోంది. నవంబరు నెల నుంచి ఈ తగ్గింపు ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయి.
ఆరేళ్ల తర్వాత తగ్గనున్న ఛార్జీలు
వచ్చే నెల నుంచి అమల్లోకి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే రూ.23 కోట్ల ఉపశమనం
చిత్తూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి రానుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈఆర్సీ సూచనతో కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరిట బిల్లుల భారాన్ని తగ్గిస్తోంది. నవంబరు నెల నుంచి ఈ తగ్గింపు ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ సర్వీసుల వివరాలు
గృహ: 13,73,346
వాణిజ్య: 1,61,215
ఎల్‌టీ: 19,22,041
పరిశ్రమలు: 21,117
వ్యవసాయ: 3,17,709
ప్రభుత్వ సర్వీసులు: 46,690
చ్‌టీ: 1906
ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ కనెక్షన్లకు మినహాయిస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇతర సర్వీసులు 35.26 లక్షలున్నాయి.ఇప్పటిదాకా విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర వ్యయాలు కలిపి ‘ట్రూఅప్’ పేరిట అదనంగా వసూలు చేస్తూ వచ్చారు. 2022 ఆగస్టులో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ అదనపు వసూళ్లను ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.25 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.75 కోట్ల భారం వినియోగదారులపై పడింది. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన కొనుగోళ్లు, వాస్తవ లెక్కలపై కూటమి ప్రభుత్వం సమీక్షించింది. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిన దానికంటే డిస్కంలకు విద్యుత్ పంపిణీకి, మరమ్మతులకు అయిన ఖర్చు తక్కువగా ఉందని, ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు విద్యుత్ వినియోగం ఆధారంగా యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గించనున్నారు. నవంబరు నుంచి ఏడాది పాటు (అక్టోబరు 2026 వరకు) ఈ మేరకు తగ్గించి బిల్లులు ఇవ్వనున్నారు. వినియోగదారులకు దాదాపు రూ.23 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎలా తగ్గుతుందంటే..
ఏడాదికాలంలో వినియోగదారుడు 2400 యూనిట్లను వినియోగిస్తే దానికి సంబంధించి రూ.322 లబ్ధి కలుగుతుంది. 2024 ఏప్రిల్‌లో 200 యూనిట్ల కరెంటు వాడివుంటే ట్రూడౌన్ ఛార్జీలు రూ.26.86గా వస్తాయి. ఈ మొత్తాన్ని నవంబరు బిల్లులో సర్దుబాటు చేస్తారు. 2024 ఏప్రిల్‌లో వచ్చిన ఛార్జీలు నవంబరు, 2024 మేలో వచ్చినని డిసెంబరులో సర్దుబాటు చేస్తారు. 2026 అక్టోబరు వరకు ఈ విధానం అమలవుతుంది.