నేతిగుట్లపల్లె వద్ద పట్టుబడ్డ ఎర్రచందనం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:10 AM
కర్ణాటక రాష్ట్రానికి ఎర్రచందనం తీసుకెళుతూ మార్గమధ్యంలో మొరాయించిన కారును పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు.
పుంగనూరు, సెప్టెంబరు12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రానికి ఎర్రచందనం తీసుకెళుతూ మార్గమధ్యంలో మొరాయించిన కారును పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు.అన్నమయ్య జిల్లా రాజంపేట, రాయచోటి ప్రాంతం నుంచి గురువారం రాత్రి ముగ్గురు స్మగ్లర్లు ఇన్నోవా కారులో రాయచోటి, మదనపల్లె,పుంగనూరు మీదుగా కర్ణాటకకు 19 ఎర్రచందనం దుంగలను తరలించడానికి బయల్దేరారు. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు రాగానే కారు మొరాయించగా నేతిగుట్లపల్లె వైపు కారును మళ్లించారు.అక్కడ పల్లం ఉండడంతో హంద్రీనీవా పంప్ హౌస్ వద్దకు వెళ్లి కారు ఆగింది.దీంతో కారులోని ఎర్రచందనం దుంగలను పక్కనే చెట్లు, పొదల మద్యలో ఉంచి కారు మెకానిక్ కోసం ఉదయం వరకు వెయిట్ చేశారు.వీరిని గమనించిన రైతులు పుంగనూరు సీఐ సుబ్బరాయుడికి సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోగా గమనించిన దుండగులు నేతిగుట్లపల్లె రిజర్వాయర్ వైపు పరారయ్యారు. పోలీసులు వెంబడించి వారిలో హోసూరుకు చెందిన సర్దార్‌బాషా(45)ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో దాచిన ఎర్రచందనం దుంగలను, కారును పోలీసులు సీజ్ చేశారు. పరారైన వారు ఎవరు, ఎక్కడినుంచి ఎర్రచందనం ఎక్కడికి తరలిస్తున్నారు అనే సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.