Share News

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:41 AM

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని అని జనసేన అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కమిటీలు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

చిత్తూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని అని జనసేన అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ‘జనసేన బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ, పార్లమెంటు స్థాయి వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలను నియమిస్తాం. మరో 15 ఏళ్ల పాటే ఇదే స్ఫూర్తితో కొనసాగాలి. అప్పుడే అభివృద్ధి సుస్థిరమవుతుంది. కూటమి నాయకులతో చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్స్‌ ఉంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోండి. వైసీపీ హయాంలో ఈ జిల్లాకే తలమానికమైన శేషాచలం అడవుల్ని అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటివరకు దొరికిన సంపద 10 శాతం మాత్రమే. ఇదే రూ.వేల కోట్లలో ఉంటే.. దొరకనిది ఇంకెన్ని రూ.వేల కోట్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలి’అన్నారు. గత నెలలో తిరుపతి, పలమనేరు ప్రాంతాల్లో పర్యటించిన పవన్‌ తమను పట్టించుకోలేదని జనసేన శ్రేణులు అసంతృప్తి చెందినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి జనసేన శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాల్లో కూడా బెంజి కార్లు వెళ్తున్నాయంటే మీరు నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో జరిగిన అభివృద్ధే కారణమని పవన్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ అభినందించారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టినప్పుడు.. మీరిచ్చిన సపోర్టు మరువలేనిదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ అన్నారు.సీఎం అనుభవం, మీ సామర్థ్యంతోనే పీఆర్‌, ఆర్‌డీ శాఖలు బలోపేతమవుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ చెప్పారు. జనసేనకు నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేశామని, భవిష్యత్తులో మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌, జనసేన నేత హరిప్రసాద్‌ చెప్పారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరుకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ 2.10గంటలకు తిరుగుపయనమయ్యారు. చిత్తూరు డీడీవో కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వర్చువల్‌ విధానంలో 77 డీడీవోల కార్యాలయాలను స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు.

Updated Date - Dec 05 , 2025 | 01:41 AM