Share News

‘ సర్‌ ’కు సమాయత్తం

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:41 AM

జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌-సర్‌)కు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.

‘ సర్‌ ’కు సమాయత్తం
పలమనేరులో ఇంటి నెంబర్ల వారీగా ఓటర్ల జాబితా వివరాలను పరిశీలిస్తున్న బీఎల్‌వో

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌-సర్‌)కు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.2002లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లను ప్రస్తుతమున్న జాబితాతో సరిపోల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల వారీగా అప్పటి ఓటర్ల డేటాను బీఎల్‌వో యాప్‌కు పంపించారు. 2025 ఓటర్ల జాబితాలో ఈ డేటాను అనుసంధానం చేయగా మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టారు. దీనిలో 52 శాతం ఓటర్లు అందుబాటులో లేనట్లు గుర్తించారు. త్వరలో ఎస్‌ఐఆర్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. అప్పటికీ వీరు అందుబాటులో లేకపోతే జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు.

2002నాటికి 18 ఏళ్లు నిండి ఓటర్లుగా ఉన్న వారి వివరాలను తీసుకున్నారు. 2025కు వీరి వయస్సు 40ఏళ్లు పైబడుతుంది. ఇప్పటి జాబితాలో 40 ఏళ్లు పైబడిన వారి వివరాలు, 2002లో 18ఏళ్లు నిండి ఓటు హక్కు పొందిన వారితో సరిపోల్చారు.

మ్యాపింగ్‌ ఎలా జరిగిందంటే.. 2002 జాబితాలో ఓటరుగా ఉన్నవారి ఫొటో ఉందా ....లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.2002-2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ చేసిన క్రమంలో 52 శాతం మంది ప్రస్తుత ఓటర్ల జాబితాలో లేనట్లు గుర్తించారు. 2002నాటికి 18 ఏళ్లు నిండినప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోని వారి పేర్లు ప్రస్తుత జాబితాలో నమోదై ఉంటే దీనికి కారణాలేంటి?అప్పట్లో వీరి కుటుంబ సభ్యుల పేర్లున్నాయా అనే కోణంలో మ్యాపింగ్‌ చేశారు.చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2002నాటికి 13, 25, 269 మంది ఓటర్లున్నారు. 2025లో ఈ సంఖ్య 15, 74, 800కు పెరిగింది. అంటే 2, 49, 531మంది ఓటర్లు పెరిగారు. ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ సందర్భంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు.

Updated Date - Nov 22 , 2025 | 12:41 AM