రేషన్ లెక్క ... ఇక పక్కా
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:51 AM
చిత్తూరులో పౌరసరఫరాల అధికారి ఇటీవల ఒక చౌకదుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ-పో్‌సలోని సరుకుల నిల్వను పరిశీలించారు. సెల్‌ఫోన్‌లోని యాప్‌లో ఉన్న వివరాలను పోలిస్తే తేడా వచ్చింది. ఈ-పోస్ మిషన్‌ను స్వాధీనం చేసుకుని మరో డీలర్‌కు చౌకదుకాణ బాధ్యతను అప్పగించారు.
ప్రత్యేక యాప్‌తో అవకతవకల గుట్టు రట్టు
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): చిత్తూరులో పౌరసరఫరాల అధికారి ఇటీవల ఒక చౌకదుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ-పో్‌సలోని సరుకుల నిల్వను పరిశీలించారు. సెల్‌ఫోన్‌లోని యాప్‌లో ఉన్న వివరాలను పోలిస్తే తేడా వచ్చింది. ఈ-పోస్ మిషన్‌ను స్వాధీనం చేసుకుని మరో డీలర్‌కు చౌకదుకాణ బాధ్యతను అప్పగించారు.పౌరసరఫరాల వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రేషన్ షాపుల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ‘సివిల్ సప్లయ్ ఇన్‌స్పెక్షన్’ పేరిట ప్రత్యేక యాప్‌ను ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సరుకుల పంపిణీలోని అక్రమాలను నిరోధించేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. పౌరసరఫరాల శాఖలోని అధికారులు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్వో, డీఎస్వో, ఆర్డీవో, జేసీ నుంచి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ వరకు ఈ యాప్ సహాయంతో రేషన్ దుకాణాల్లోని సరుకులను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం నెలలో 1నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ డిపోల ద్వారా జరుగుతోంది. 15నుంచి 25వ తేదీ మధ్య పంపిణీ వుండదు. తిరిగి 25వ తేదీ నుంచి ఇండ్ల వద్దకే రేషన్ పంపిణీ జరుగుతోంది.నెలలో ఏ రోజైనా ఎఫ్‌పీ షాపుల్లో తనిఖీలు చేసే అధికారం అధికారులకు ప్రభుత్వం కల్పించింది. 15-20 తేదీల మధ్య కూడా పంపిణీ లేకున్నా దుకాణాల్లో పంపిణీ, నిల్వ, కార్డుదారుల వివరాలను తనిఖీ చేయవచ్చు. కాబట్టి రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను కప్పిపుచ్చడం ఇకపై ఏమాత్రం సాధ్యం కాదు. బ్లాక్ మార్కెట్‌లో సరుకులు తరలించి అధిక మొత్తాలకు అమ్మకాలు చేసేందుకు వీలు కాదు. గతంలో మాదిరిగా అధికారులు సైతం మొక్కుబడిగా తనిఖీలు చేసేందుకు వీల్లేదు. జిల్లాలో 5,34,721 మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి 1379 డీలర్ల ద్వారా 8500 టన్నుల బియ్యం ప్రతినెలా పంపిణీ అవుతోంది. గతంలోని మాన్యువల్ విధానంలో తప్పుల సర్దుబాటుకు ఆస్కారం ఉండేది. ప్రస్తుతం అధికారులు చౌకదుకాణాల తనిఖీకి వెళ్ళిన వెంటనే ఈ-పో్‌సను తీసుకుంటున్నారు. అందులోని వివరాలు, యాప్‌లోవున్న ఆన్‌లైన్ వివరాలతో సరిపోలుస్తున్నారు. తేడాలుంటే అక్కడికక్కడే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తనిఖీల సమయంలోనే కార్డుదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సైతం యాప్‌లో నమోదు చేస్తున్నారు. సరుకుల సరఫరా, తూకం సక్రమంగా ఉన్నది, లేనిది... డీలర్ల ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలపై కార్డుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు.