Share News

హంద్రీ-నీవా కాలువ పనులకు వర్షం అడ్డంకి

ABN , Publish Date - Aug 22 , 2025 | 02:48 AM

హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కాలువ పనులకు వర్షం అడ్డంకిగా మారింది.వారం రోజులుగా కురిసిన వర్షాలతో కాల్వకు అటు, ఇటు ప్రవహించే వంకల నుండి వాన నీరు పనులు జరిగే ప్రాంతానికి కొట్టుకురావడంతో కాంక్రీట్‌ పనులకు అంతరాయం ఏర్పడింది.

హంద్రీ-నీవా కాలువ పనులకు వర్షం అడ్డంకి
హంద్రీ-నీవా కాలువలో వర్షపునీటిని బయటకు తోడే ప్రయత్నాలు

వి.కోట, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కాలువ పనులకు వర్షం అడ్డంకిగా మారింది.వారం రోజులుగా కురిసిన వర్షాలతో కాల్వకు అటు, ఇటు ప్రవహించే వంకల నుండి వాన నీరు పనులు జరిగే ప్రాంతానికి కొట్టుకురావడంతో కాంక్రీట్‌ పనులకు అంతరాయం ఏర్పడింది. హంద్రీ-నీవా కాల్వలో కృష్ణా జలాలు పలమనేరు నియోజకవర్గంలో 67 కిలోమీటర్లు, కుప్పం సెగ్మెంట్‌ పరిధిలో 64 కిలోమీటర్లు ప్రవహించి కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు చేరనున్నాయి.రెండు నెలలుగా వి.కోట మండల పరిధిలో హంద్రీ - నీవా లైనింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. వి.కోట పరిధిలో మెట్లపల్లె, ఆదినేపల్లె వద్ద రెండు లిప్ట్‌ హౌస్‌లు ఈ కాల్వపై ఉన్నాయి.అయితే కాల్వలో నీళ్లు ఇంకిపోతుండడంతో వాటికి రెండు వైపులా లైనింగ్‌తో పాటు కిందిభాగంలోనూ కాంక్రీట్‌ వేస్తున్నారు. దానమయ్యగారిపల్లె వద్ద హైవేకు ఇరు వైపులా కాలువ పనులు జరుగుతున్నాయి. గత వారం కురిసిన వానలకు ఇసుక మేటలు కాలువలో ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయాయి.వాటికి తోడు బురద నీళ్లు నిల్వ వుండడంతో కింద కాంక్రీట్‌ వేయాల్సిన చోట వర్షపు నీటిని తోడేందుకు మోటార్లను వాడుతున్నారు.వాటికి తోడు కాలువ లోపల కొట్టుకువచ్చిన మట్టి, ఇసుక మేటలను తొలగించడం కష్టంగా మారింది. దానమయ్యగారిపల్లె వద్ద పేరుకుపోయిన మట్టిని తొలగించి పనులు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వి.కోట పరిధిలో హంద్రీ - నీవా కాలువ లైనింగ్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని, వర్షం లేకుంటే పది రోజుల్లో పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 02:49 AM