Share News

అమ్మవారి ఆలయ శుద్ధి

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:31 AM

తిరుచానూరులో ఈనెల 17న ప్రారంభం కానున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు.

అమ్మవారి ఆలయ శుద్ధి
ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్న జేఈవో వీరబ్రహ్మం తదితరులు

తిరుచానూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తిరుచానూరులో ఈనెల 17న ప్రారంభం కానున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్రజలాన్ని ప్రోక్షణం చేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌ రమేష్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

10 పరదాలు బహూకరణ

హైదరాబాద్‌కు చెందిన స్వర్ణకుమార్‌రెడ్డి తన ప్రతినిధుల ద్వారా అమ్మవారి ఆలయానికి మంగళవారం 7 పరదాలు, అదే విధంగా తిరుపతికి చెందిన మణి 3 పరదాలను అందించారు. వీటిని ఆలయ అధికారులకు అందజేశారు.

17 నుంచి బ్రహ్మోత్సవాలు

ఈనెల 17న ఉదయం ధనుర్లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్న శేష వాహనం, 18న ఉదయం పెద్ద శేష, రాత్రి హంస.. 19న ముత్యపు పందిరి, సింహ.. 20న కల్పవృక్ష, హనుమంత.. 21న పల్లకీ ఉత్సవం, గజ వాహనం.. 22న సర్వభూపాల, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం.. 23న సూర్యప్రభ, చంద్రప్రభ.. 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీ తీర్థం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 8 నుంచి 10గంటల వరకు, రాత్రి 7 నుంచి 9గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Updated Date - Nov 12 , 2025 | 01:31 AM