Share News

మొండి బకాయిలపై దండన మంత్రం

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:49 PM

డీసీసీబీ కు మొండి బకాయిల సెగ తప్పడం లేదు. సింగిల్‌ విండోల ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక పంట రుణాలుగా ఇస్తుంది.

మొండి బకాయిలపై దండన మంత్రం
డీసీసీబీ ప్రధాన కార్యాలయం

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కు మొండి బకాయిల సెగ తప్పడం లేదు. ఆప్కాబ్‌ నుంచి తెచ్చిన రుణాలను డీసీసీబీ కింద ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాల(సింగిల్‌ విండోల) ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక పంట రుణాలుగా ఇస్తుంది. వీటిని సింగిల్‌ విండోలు, సిబ్బంది కలిసి సకాలంలో వసూలు చేసి డీసీసీబీకి జమచేయాలి. అయితే సింగిల్‌విండోల్లోని పాలకవర్గాలు బినామీ రైతుల పేరిట వారే భారీగా రుణాలు వాడేశారు. దీనివల్ల రూ.102 కోట్ల వరకు మొండి బకాయిలు పెరిగిపోయాయి.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

డీసీసీబీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.137 కోట్ల మేర పంపిణీ చేసిన వ్యవసాయ రుణాల్లో ఇప్పటివరకు రూ.35 కోట్లను మాత్రమే వసూలు చేశారు. ఏళ్ల తరబడి రూ.102 కోట్లు వసూలు కాలేదు. రుణగ్రహీతల జాబితాలోని 280 మందిలో సుమారు 30 మంది రూ.40 కోట్లు చెల్లించాల్సిఉంది. అప్పటి ప్రభుత్వం అమూల్‌ సంస్థ కోసం పాడిరుణాల పేరిట వెయ్యి మందికి రూ.12కోట్లను అందజేశారు. ఇందులో అతికష్టంపై రూ.6 కోట్లు వసూలు చేయగా, మరో 650 మంది నుంచి ఇంకా రూ.6 కోట్లు వసూలు కావాల్సి ఉంది.

పథకాలకు లంకెపెట్టి

ప్రభుత్వ పథకాల అమలుకు డీసీసీబీకి లంకె

పెడుతున్నారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యంత్ర పరికరాలపై లబ్ధిదారులకు రాయితీపై రుణాలు మంజూరు చేశారు. 250 గ్రూపులకు సంబంధించి 866 మంది డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.4కోట్ల వరకు బకాయిలున్నాయి.

చట్టపరమైన చర్యలకు సిద్ధం

చాలామంది వ్యవసాయ రుణాలను సొంత వ్యాపారాలు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు. వాయిదాలు చెల్లించమంటే రాజకీయ అండతో ఎదురుతిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. వడ్డీ పెరుగుతున్నా.. రుణం రెట్టింపైనా.. వారిలో ఏ మాత్రం స్పందన లేదు. కొందరైతే దౌర్జన్యానికి సైతం వెనుకాడడం లేదు. అలాంటివారిపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు.

రికవరీ బృందాల ఏర్పాటు

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డిని నియమించాక రుణ వసూళ్లపై దృష్టి పెట్టారు. రైతులకోసం ఏర్పాటు చేసుకున్న బ్యాంకు దుస్థితిని నేతలకు వివరించి సహకరించాలని కోరారు. ఏజీఎం, చీఫ్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల పర్యవేక్షణలో డీసీసీబీ బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న సిబ్బంది, సూపర్‌వైజర్లు, సింగిల్‌విండో ఉద్యోగులతో బృందాలు ఏర్పాటు చేసి, రికవరీ మొదలుపెట్టారు.

పోలింగ్‌కి ముందు రూ.20 కోట్ల రుణాలు

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందుగా పుంగనూరు, బైరెడ్డిపల్లె, పలమనేరు, వి.కోట, మదనపల్లె డీసీసీబీ బ్రాంచుల ద్వారా పంట రుణాల పేరిట రూ.20 కోట్లు మంజూరు చేశారు. అక్కడి రైతుల భూమిని బ్రాంచ్‌ మేనేజర్లు తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వాలి. అలాకాకుండా అప్పటి వైసీపీ నేతల సిఫారసు మేరకు ఇష్టానుసారం రుణాలు మంజూరు చేశారు. ఈ రుణాలన్నీ వైసీపీ శ్రేణులకే చేరినట్లు ఆరోపణలున్నాయి.

మొండి బకాయిలు వసూలు చేస్తాం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించక.. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా గుర్తించిన రూ.102 కోట్ల వసూలుకు నోటీసులిచ్చాం. రికవరీ బృందాలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

- సి.శంకర్‌ బాబు, డీసీసీబీ సీఈవో, చిత్తూరు.

Updated Date - Oct 05 , 2025 | 11:49 PM