Share News

సమయపాలన పాటించాల్సిందే

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:40 AM

పాఠశాలల్లో టీచర్ల బోగస్‌ హాజరు, పనితీరుపై ప్రభుత్వ దృష్టి

 సమయపాలన పాటించాల్సిందే
చిత్తూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఉపాధ్యాయుల నియామకం, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన క్రమంలో సిలబస్‌ బోధన, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై కచ్చితంగా వ్యవహరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు యాప్‌లో హాజరు నమోదు చేయడంతో పాటు 9.30 గంటలకు హాజరు నివేదికను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. డీఈవోతోపాటు డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. జిల్లాలోని 2,397 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 2,51,317 మంది విద్యార్థులు చదువుతున్నారు. 8,314 మంది టీచర్లు పనిచేస్తున్నారు.

హాజరు నిబంధనలు ఇలా..

ఉదయం 9 గంటలకు హాజరై సాయంత్రం 4 వరకు కచ్చితంగా పాఠశాలల్లోనే ఉండాలి.

ఎవరైనా లీవ్‌ పెడితే ఉదయం 9 గంటలలోపే దరఖాస్తు చేసుకోవాలి.

స్పెషల్‌ డ్యూటీపై వెళితే హాజరు నమోదు చేసుకోవాలి.

ఉదయం 9.15 గంటలకు అటెండెన్స్‌ రిపోర్టు తీసి పంపాలి.

రిపోర్టులో లీవు దరఖాస్తు చేయకున్నా, ఇన్‌టైమ్‌ మార్క్‌ వేయకున్నా, స్పెషల్‌ డ్యూటీ అని పెట్టి హాజరు నమోదు చేయకపోయినా వారికి షోకాజ్‌ నోటీసులు ఇస్తారు.

ఈ ప్రక్రియలో పలుమార్లు ఇదే విధానం కొనసాగితే సంబంధిత టీచర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

మధ్యాహ్నం లీవ్‌ పెట్టేవారు 12.30 గంటల తర్వాత మాత్రమే అవుట్‌ టైం నమోదు చేయాలి.

ఉదయం లీవ్‌ పెట్టిన వారు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత 12.45 లోపు హాజరు నమోదు చేయాల్సి ఉంది.

ప్రత్యేక సెల్‌ ఏర్పాటు

జిల్లాలోని పాఠశాలలు, టీచర్ల పనితీరు, హాజరు, సమయపాలన అంశాలపై మానిటరింగ్‌ చేసేలా కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, సెక్టోరియల్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఉదయం, సాయంత్ర వేళల్లో ఉపాధ్యాయుల హాజరు, పాఠశాల ముగిసిన తర్వాత సమయాన్ని నమోదు చేస్తారు. పాఠశాలల పనితీరుపై విద్యాశాఖ కమిషనర్‌ రోజూ ఉదయం 10 గంటలకు ఆర్జేడీ, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలతో వెబెక్స్‌ నిర్వహిస్తారు.

మధ్యాహ్న భోజనం హాజరుపైనా దృష్టి

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రోజువారి మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉంది. ఇందుకోసం విద్యార్థుల రోజువారీ హాజరు తప్పనిసరి. పలువురు విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయడం లేదని తెలుస్తోంది. కానీ వారిని కూడా లెక్కల్లో చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వారికి చెందాల్సిన భోజనం, గుడ్లు, చిక్కీలు తదితరాలు ఎవరి ఖాతాల్లో జమవుతున్నాయనే దానిపైనా దృష్టి సారించనున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:40 AM