గగన ప్రయాణంలో దారి తప్పిన పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్
ABN , Publish Date - May 19 , 2025 | 01:26 AM
పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. వివరాలన్నీ మళ్లీ వెల్లడిస్తామంటూ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. లైవ్ ఆగిపోయింది. అంతే.. ఏం జరిగిందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ. కాసేపటికే మూడో దశలో రాకెట్ వేగం తగ్గి తన గమనాన్ని వీడి దిశ మార్చుకుని విఫలం చెందడంతో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఒక్కసారిగా బాధతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది.
(సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి)
ఆదివారం ఉదయం 5.59 గంటలు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నారింజ రంగు లేలేత పసిడి వర్ణాలతో పులికాట్ సరస్సు- బంగాళాఖాతానికి మధ్య పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ నింగిలోకి ఎగిరింది.
6.07 గంటలు: రాకెట్ రెండు దశలు సునాయసనంగా పూర్తిచేసుకొని మూడో దశ ప్రారంభం కాగానే గమన వేగం తగ్గి దారితప్పింది. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ. రాకెట్ ప్రయోగ లైవ్ కూడా కాసేపు నిలిపివేశారు. అందరిలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి.
6.11 గంటలు: పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. వివరాలన్నీ మళ్లీ వెల్లడిస్తామంటూ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. లైవ్ ఆగిపోయింది.
అంతే.. ఏం జరిగిందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ. కాసేపటికే మూడో దశలో రాకెట్ వేగం తగ్గి తన గమనాన్ని వీడి దిశ మార్చుకుని విఫలం చెందడంతో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఒక్కసారిగా బాధతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది.
షార్, శ్రీహరికోట సమీపంలోని సూళ్లూరుపేట, సమీప గ్రామాలన్నీ రాకెట్ ప్రయోగమని సందడిగా ఉన్నాయి. తెల్లవారు జామునుంచే అందరి కళ్లు షార్ వైపే. శనివారం ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా 22 గంటల పాటు కొనసాగి.. ఆదివారం ఉదయం సరిగ్గా 5.59 గంటలకు నిర్దేశిత సమయానికే పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ నింగిలోకి ఎగిరింది. వీక్షకులతో పాటు షార్ శాస్త్రవేత్తలు, భవనాల పైకెక్కి రాకెట్‌ను చూస్తున్న వారంతా చప్పట్లు కేరింతలు కొడుతూ ఆనందంగా చూశారు. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, సహచర శాస్త్రవేత్తలు చూస్తుండగానే రాకెట్ రెండు దశలు సునాయసనంగా పూర్తిచేసుకొంది. మూడో దశ ప్రారంభమై గమనం వేగం తగ్గి దారితప్పింది. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ. రాకెట్ ప్రయోగ లైవ్ కూడా కాసేపు నిలిపివేశారు. అందరిలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. సరిగ్గా 12 నిమిషాలకు ఇస్రో చైర్మన్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని, ప్రయోగం ఇంకా పూర్తికాలేదని చెప్పారు. మరోవైపు లైవ్ ఆగింది. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న మీడియా సెంటర్‌తో పాటు షార్ ప్రాంతమంతా నిశ్శబ్ద వాతావరణంతో మూగపోయింది. ఈ రాకెట్ ద్వారా పంపిన నిఘా నేత్ర ఉపగ్రహం నింగిలోకి పోకుండా విఫలం చెందింది. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఈవోఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహ ప్రయోగం విఫలమవడం అందరినీ నిరాశ పరిచింది.
శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ
ప్రయోగం విఫలమని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్‌తో కలిసి మీడియా సెంటర్‌కు వచ్చి చెప్పారు. ఇప్పటి వరకు సాలిడ్ మోటారు మూడో దశలో చిన్నపాటి లోపం కూడా తలెత్తలేదు. భారీ ఉపగ్రహాలు, ఒకేసారి 103 ఉపగ్రహాలను కూడా పీఎఎ్‌సఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అలవోకగా అంతరిక్షంలోకి పంపి విజయకేతనం ఎగురవేశారు. అలాంటిది కీలకమైన దేశ రక్షణకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగంలో ఎందుకిలా జరిగిందని తలలుపట్టుకుంటున్నారు. జనవరిలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 15 ద్వారా ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. మూడు రోజుల తరువాత ఉపగ్రహం నుంచి సంకేతాలు అందలేదు. దీంతో ఆ ప్రయోగం పాక్షిక విజయంగానే మిగిలింది. ఇప్పుడు 101వ ప్రయోగం సాంకేతిక సమస్య తలెత్తి విఫలం చెందడంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు.
ప్రయోగాన్ని తిలకించిన పార్లమెంటరీ కమిటీ
పీఎ్‌సఎల్వీ-సీ 61 ప్రయోగాన్ని పార్లమెంటరీ స్థాయి కమిటీ సభ్యుల బృందం తిలకించింది. ఏడుగురితో కూడిన ఈ సభ్యుల బృందం శనివారం రాత్రి శ్రీహరికోటలోనే బసచేసి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. దేశ రక్షణకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగం కావడంతో వీరు ఆసక్తిగా తిలకించారు. ప్రయోగం విఫలమైందని తెలిసి.. వీరు శాస్త్రవేత్తల భుజం తట్టి అభినందిస్తూ లోపాన్ని సరిచేసి మరో ప్రయోగాన్ని విజయవంతం చేయాలని ప్రోత్సహించారు.