Share News

ఇష్టారాజ్యంగా ప్రొటోకాల్‌ దర్శనం

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:59 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఈవోగా పనిచేస్తున్న విద్యాసాగర్‌ రెడ్డి మళ్లీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా పైవ్రేటు వ్యక్తులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రోటోకాల్‌ దర్శనాలు చేయించారు.

ఇష్టారాజ్యంగా ప్రొటోకాల్‌ దర్శనం

ముగ్గురు ముక్కంటి ఆలయ ఉద్యోగులకు మెమో

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి) : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఈవోగా పనిచేస్తున్న విద్యాసాగర్‌ రెడ్డి మళ్లీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా పైవ్రేటు వ్యక్తులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రోటోకాల్‌ దర్శనాలు చేయించారు. సీసీ కెమెరాల ద్వారా ఈవో బాపిరెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఏఈవోతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను వివరణ కోరుతూ మెమోలు జారీ చేశారు. ఏఈఓ విద్యాసాగర్‌ రెడ్డి 9 నెలల క్రితం కాణిపాకం నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయానికి బదిలీపై వచ్చారు. ఆది నుంచి ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. పీఆర్‌ఓ కార్యాలయంలో ప్రోటోకాల్‌ ఇన్‌చార్జి అధికారిగా రెండు వారాల క్రితం వరకు ఆయన విధులు నిర్వహించారు. వైసీపీ నేతల ద్వారా సిఫార్సులపై వచ్చే వారికి, కొందరు దళారుల ద్వారా వచ్చే పైవ్రేటు వ్యక్తులకు ఇష్టారాజ్యంగా తెల్ల కాగితాలపై సంతకాలు చేసి పాసులు జారీ చేశారు. ఓ దళారి దర్శనానికి వెళ్లి పట్టు పడడంతో నాలుగు నెలల క్రితం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అధికారులు మందలించినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. దీంతో ఈవో బాపిరెడ్డి ఆయన్ను పీఆర్వో కార్యాలయం నుంచి ఆలయంలోని కంచి గడప వద్దకు బదిలీ చేశారు. అక్కడా ఆయన టికెట్ల పరిశీలనలో అలసత్వం వహించారు. అనుకూలమైన వ్యక్తులను టికెట్లు లేకుండానే క్యూలైన్లోకి అనుమతిస్తున్నారన్న అపవాదు మూట కట్టుకున్నారు. దీంతో ఈవో బాపిరెడ్డి ఆయనపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం కొందరు పైవ్రేట్‌ వ్యక్తులు దర్శనం కోసం రాగా విద్యాసాగర్‌ రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో పూలమాలవేసి స్వాగతించారు. స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా అంతరాలయ దర్శనం చేయించారు. కీలకమైన వేద ఆశీర్వాదం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిపించారు. ఆగ్రహించిన ఈవో వివరణ కోరుతూ విద్యాసాగర్‌ రెడ్డి, పీఆర్‌వో కార్యాలయంలో పనిచేసే రికార్డ్‌ అసిస్టెంట్‌ దుర్గాప్రసాద్‌, ఆశీర్వాద మండపంలో పనిచేసే విశ్వనాథ శర్మకు నోటీసులు జారీ చేశారు. వివరణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Apr 13 , 2025 | 02:59 AM