మరో 203 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:02 AM
అదనంగా మరో 203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ప్రస్తుతమున్న 1776 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా నేటికీ 15,75,899 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు మేర ‘సర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్)’ చేపట్టినట్లు వివరించారు. ఈ సర్వే ద్వారా బోగస్, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించనున్నట్లు చెప్పారు. దీనికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు 70శాతం మ్యాపింగ్ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్‌కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు సురేంద్ర కుమార్ (టీడీపీ), పరదేశి (కాంగ్రెస్), అట్లూరి శ్రీనివాసులు (బీజేపీ), ఉదయ్‌కుమార్ (వైఎస్సార్), గంగరాజు (సీపీఎం), సురేంద్ర (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.