Share News

బిందు సేద్యానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:03 AM

గత ప్రభుత్వ హయాంలో చతికిలపడ్డ బిందుసేద్యం కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి జీవం పోసుకుంది.

బిందు సేద్యానికి ప్రోత్సాహం
క్యాలీఫ్లవర్‌ సాగులో ఏర్పాటు చేసిన డ్రిప్‌ యూనిట్‌

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో చతికిలపడ్డ బిందుసేద్యం కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి జీవం పోసుకుంది. పడమటి మండలాల్లో పండ్ల, పూలతోటలు సాగు చేస్తుండగా, తూర్పు మండలాల్లో చెరకు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 2024-2025 సంవత్సరంలో 25,162 ఎకరాల్లో 11,739 మంది రైతులకు రూ.89.74కోట్ల రాయితీ అమలు చేశారు. 2025-26 సంవత్సరానికి 30వేల ఎకరాల బిందు, తుంపర్ల సేద్యానికి రూ.97.94 కోట్ల రాయితీని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు 43,180 ఎకరాల్లో సాగు చేసేందుకు యూనిట్ల కోసం 16,649 మంది రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,160 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేసే 909 మంది రైతులకు రూ.7.88 కోట్ల విలువైన పరికరాలు మంజూరు చేశారు.

పది రోజులకోసారి యూనిట్ల మంజూరు

బిందుసేద్యానికై దరఖాస్తు చేసుకున్న రైతులకు పది రోజులకు ఒకసారి యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఏటా జనవరి, ఫిబ్రవరి ఆపై నెలల్లో కేటాయింపులు చేయనుండగా, ఈ ఏడాది నుంచి ముందస్తుగానే ఆగస్టు నుంచే కేటాయింపులు చేయడం రైతులకు అనుకూలంగా మారింది.

చెరకు సాగుకూ..

పడమటి మండలాల్లో రైతులు ఎక్కువ శాతం ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. టమోటా, వంకాయ, బీన్స్‌ ఉర్లగడ్డ, దానిమ్మ, జామ, మామిడి, కొబ్బరి, క్యాబేజీ, చెరకు, బొప్పాయి తదితర పంటలకు బిదు సేద్యం యూనిట్లు అందజేస్తున్నారు. గతేడాది నుంచి చెరకు సాగుకు బిందు సేద్యంలో అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం తదితర మండలాల్లో రైతులకు మరింత ప్రోత్సాహకం లభిస్తోంది.

రాయితీతో ఇలా..

బిందు, తుంపర్ల సేద్యం కింద సాగు చేసే సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ద్వారా అందజేస్తోంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.2.18 లక్షల వరకు బిందు సేద్య పరికరాలు అందిస్తున్నారు. ఐదు నుంచి 10 ఎకరాల్లోపున్న రైతులకు 90 శాతంతో గరిష్ఠంగా, ఆపైబడి సాగుచేసే రైతులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను రైతుల పొలాల్లో అమర్చేందుకు జిల్లాలో దాదాపు 27 కంపెనీలున్నాయి.

Updated Date - Sep 13 , 2025 | 12:03 AM