Share News

‘బ్లూబర్డ్‌’ ప్రయోగానికి సన్నాహం

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:44 PM

రాకెట్‌ అనుసంధాన పనులు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వ్యాబ్‌లో జరుగుతున్నాయి

‘బ్లూబర్డ్‌’ ప్రయోగానికి సన్నాహం
భారీ భద్రత నడుమ షార్‌కు వెళ్తున్న ఇంధన వాహనాలు

అమెరికాకు చెందిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.. బ్లూబర్డ్‌ను డిసెంబరు తొలివారంలో షార్‌ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. దీనికి సంబంధించి రాకెట్‌ అనుసంధాన పనులు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వ్యాబ్‌లో జరుగుతున్నాయి. రాకెట్‌ రెండో దశలో ఉపయోగించే ద్రవ ఇంధనాన్ని బుధవారం రెండు ప్రత్యేక వాహనాల్లో తమిళనాడులోని లిక్విడ్‌ ప్రొపెలెంట్‌ సెంటర్‌ మహేంద్రగిరి నుంచి భారీ భద్రత నడుమ రోడ్డుమార్గాన షార్‌కు తీసుకొచ్చారు. కాగా, 6,400 కిలోల బరువైన బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ అభివృద్ధి చేసింది. అక్టోబరు 15న దీనిని షార్‌కు తీసుకొచ్చారు. ఎనిమిది మంది అమెరికా శాస్త్రవేత్తలూ వచ్చి ప్రయోగ ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. ఇంతటి బరువైన విదేశీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి.

- సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 05 , 2025 | 11:44 PM