మూడు నెలలకే గుంతలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:06 AM
తిరుమల రెండో ఘాట్‌లో కొత్త రోడ్డు వేసి మూడు నెలలు కాకముందే గుంతలయమైంది. భారీ వర్షాలు, అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలతో కొద్ది నెలలకే మరమ్మతులకు గురైంది.
తిరుమల, నవంబరు13(ఆంధ్రజ్యోతి): తిరుమల రెండో ఘాట్‌లో కొత్త రోడ్డు వేసి మూడు నెలలు కాకముందే గుంతలయమైంది. భారీ వర్షాలు, అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలతో కొద్ది నెలలకే మరమ్మతులకు గురైంది. కొవిడ్ అనంతరం తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరగడం, వరుస వర్షాలతో తిరుమల మొదటి, రెండో ఘాట్‌రోడ్లు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దాదాపు రూ.10 కోట్లతో రెండు ఘాట్‌రోడ్ల మరమ్మతుల కోసం టీటీడీ బోర్డు ఈ ఏడాది ప్రారంభంలో తీర్మానం చేసి కాంట్రాక్టు ఇచ్చింది. తొలుత తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండో ఘాట్‌లో నూతన రోడ్డు ప్రారంభించి బ్రహ్మోత్సవాల ముందు పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ఘాట్‌రోడ్డు సిద్ధమైందనుకున్న లోపే ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో నూతన రోడ్డులోనూ గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో టీటీడీ తిరిగి మరమ్మతు పనులను ప్రారంభించింది. వర్షాలు అధికంగా కురవడం, నేషనల్ హైవే కంటే అధికంగా వాహనాల రాకపోకలు ఉన్న క్రమంలో రోడ్డు దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ మరమ్మతులు పూర్తవుతాయన్నారు. మరోవైపు కొత్త రోడ్డు ఇంత తక్కువ సమయంలో పాడవడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.