పదవులు.. పర్యటనలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:30 AM
చంద్రబాబు పర్యటనలతో, కూటమి పార్టీల నేతలకు పదవుల పంపకాలతో ఈ ఏడాది జిల్లాలో రాజకీయ సందడి కన్పించింది. అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయగా, ప్రతిపక్షంలోని వైసీపీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసింది.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి
చంద్రబాబు పర్యటనలతో, కూటమి పార్టీల నేతలకు పదవుల పంపకాలతో ఈ ఏడాది జిల్లాలో రాజకీయ సందడి కన్పించింది. అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయగా, ప్రతిపక్షంలోని వైసీపీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసింది.పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్యతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండుసార్లు, మాజీ సీఎం జగన్ ఓసారి జిల్లా పర్యటనకు వచ్చారు.
ఫ టీడీపీ కార్యకర్త హత్య
పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ (50)ను పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ కార్యకర్త వెంకటరమణ మార్చి 15న పట్టపగలే వేటకొడవలితో దాడి చేసి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీడీపీ అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ కార్యకర్త మీద వైసీపీ వాళ్లు దాడి చేయడం అనేది టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసింది. వైసీపీ హయాం నాటి పోలీసులే జిల్లా వ్యాప్తంగా పనిచేస్తుండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సహా చాలామంది టీడీపీ నాయకులు ఆరోపించారు.దీంతో ఎస్పీ మణికంఠ ఏకంగా 280 మంది పోలీసుల్ని దూర ప్రాంతాలకు బదిలీ చేసి ఇబ్బంది పెట్టారు.
ఫ పదవీయోగం
ఈ ఏడాది అధికార పార్టీల్లోని పలువురికి రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. టీటీడీ బోర్డు మెంబర్‌గా కుప్పానికి చెందిన శాంతారామ్, చుడా ఛైర్‌పర్సన్‌గా చిత్తూరుకు చెందిన కఠారి హేమలత, పీకేఎం ఉడా ఛైర్మన్‌గా కుప్పానికి చెందిన డాక్టర్ సురేష్‌బాబు, మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చిత్తూరుకు చెందిన త్యాగరాజన్, వన్నియకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తిరుచానూరుకు చెందిన సీఆర్ రాజన్‌లకు పదవులు దక్కాయి. వీరితో పాటు చాలామందికి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా అవకాశం లభించింది. కాణిపాకం బోర్డు ఛైర్మన్‌గా మరోసారి మణినాయుడ్ని నియమించడంతో పాటు మరో 16 మంది సభ్యులకూ అవకాశం ఇచ్చారు.
ఫ ఆరుసార్లు సీఎం
సీఎం చంద్రబాబు జిల్లాలో ఆరుసార్లు పర్యటించారు. ఐదుసార్లు కుప్పానికి, ఓ సారి జీడీనెల్లూరుకు వచ్చారు. కుప్పం విషయానికొస్తే జనవరిలో మూడు రోజులు పర్యటించి, జననాయకుడు పోర్టల్‌ను ప్రారంభించారు. మే నెలలో కుప్పంలోని గంగమ్మ జాతరకు భార్యతో హాజరయ్యారు. అదే నెలలో శాంతిపురం మండలంలో నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణిలతో కలిసి వచ్చారు. జూలైలో కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆగస్టులో కుప్పానికి వచ్చిన కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. మార్చి 1వ తేదీన జీడీనెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఇండస్ర్టియల్ పార్కు పెట్టేందుకు 2 వేల ఎకరాల భూమి సేకరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఫ రెండుసార్లు పవన్
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్ ఈ ఏడాది నవంబరు 10న పలమనేరుకు వచ్చి ఎలిఫెంట్ క్యాంపును ప్రారంభించారు.ఏనుగుల దాడులను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చి ఈ ఎలిఫెంట్ క్యాంపులో పెట్టారు.పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా డిసెంబరు 5న చిత్తూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీవో కేంద్రాలను ప్రారంభించారు.
ఫ ఓసారి జగన్
మామిడి రైతుల సంక్షోభాన్ని ముందు గుర్తించిన సీఎం చంద్రబాబు కిలోకు రూ.4 సబ్సిడీని ప్రకటించి ఆదుకున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతులకు నయా పైసా సాయం చేయని జగన్‌కు సీజన్ ముగిసే సమయంలో జిల్లా రైతులు గుర్తొచ్చారు. దీంతో జూలై 9న రైతుల పరామర్శ పేరుతో బంగారుపాళ్యంలో పర్యటించారు.వైసీపీ శ్రేణులు హడావిడి చేశారు. మామిడి కాయల్ని కిందపోసి ట్రాక్టర్లను తొక్కించారు.
ఫ మిథున్ అరెస్టు
లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు జూలై 19న అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన, సెప్టెంబరు 29న కండీషన్ బెయిల్‌పై విడుదలయ్యారు.ఆయన అరెస్టయ్యాక జిల్లాలో పెద్దఎత్తున నిరసనలు జరుగుతాయని వైసీపీ నేతలు భావించినా అవేమీ జరక్కపోవడంతో నిరాశ పడ్డారు.
ఫ టీడీపీ కమిటీ
టీడీపీ చిత్తూరు పార్లమెంటు కమిటీని డిసెంబరు 24వ తేదీన ప్రకటించారు. అంతకు కొన్ని రోజుల ముందే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు షణ్ముగరెడ్డి , సునీల్‌కుమార్ పేర్లను ప్రకటించారు.పాత, కొత్త నేతల కలయికతో ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, ఆఫీస్ సెక్రటరీ, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించారు.
ఫ వైసీపీ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పీపీపీ విధానంలో పూర్తి చేసేందుకు నిర్ణయిస్తే, ప్రైవేటుపరం చేయొద్దంటూ వైసీపీ నవంబరు 12న పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాల్ని చేపట్టినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాకపోవడంతో చివరకు కార్యకర్తలతోనే ప్లాన్ చేసుకున్నారు.
ఫ డీకే వారసుల అరెస్టు
చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు కుమారుడు డీఏ శ్రీనివాస్‌ను, కుమార్తె కల్పజను రియల్‌ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో డిసెంబరు 22న బెంగళూరులో అరెస్టు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. హత్య కేసుతో పాటు స్టాంపుల ఫోర్జరీ కేసు కూడా వారిమీద నమోదై వుందని బయటపడడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది.