Share News

పదవులు.. పథకాలు.. కేసులు.. విచారణలు..అరెస్టులు..

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:18 AM

ఏడాది జిల్లాలో రాజకీయ సందడి జోరుగా సాగింది. నామినేటెడ్‌ పదవులతో కూటమి పార్టీలు ఉత్సాహం పుంజుకోగా, వైసీపీ నేతలు కేసులు.. విచారణలు.. అరెస్టులు.. జైళ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కల్తీనెయ్యి, పరకామణి కేసులు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి.

పదవులు.. పథకాలు.. కేసులు.. విచారణలు..అరెస్టులు..

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ సందడి జోరుగా సాగింది. నామినేటెడ్‌ పదవులతో కూటమి పార్టీలు ఉత్సాహం పుంజుకోగా, వైసీపీ నేతలు కేసులు.. విచారణలు.. అరెస్టులు.. జైళ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కల్తీనెయ్యి, పరకామణి కేసులు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. తిరుపతి కేంద్రంగానే ఈ రెండు కేసుల విచారణ జరగడం నాయకులు హాజరుకావడం.. కేడర్‌ను ఆందోళనకు గురిచేశాయి. ఎప్పటిలాగే చింతా మోహన్‌ స్వరం ఈ ఏడాదంతా వినిపిస్తూ కాంగ్రెస్‌ ఉనికిని జిల్లాలో కాపాడారు. ఇక జగన్‌ పాలనసాగిన ఐదేళ్లూ గృహనిర్బంధాలతో కదల్లేని వామపక్ష పార్టీలూ, అనుబంధ ప్రజా సంఘాలకు ఈ ఏడాది మళ్లీ నిరసనలకు స్వేచ్ఛ లభించింది. తరచూ ఎక్కడో ఒకచోట ప్రజాగళం వినిపిస్తూనే ఉన్నారు.

ఫిబ్రవరి 4:

ఒకే ఒక్కడు గెలిచాడు

ఈ ఏడాది జరిగిన చిత్రమైన రాజకీయ పరిణామాల్లో తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఒకటి. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లుంటే అందులో ఆర్సీ మునికృష్ణ ఒక్కరే టీడీపీ తరపున కార్పొరేటర్‌గా గెలిచారు. ఒక డివిజన్‌కు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 48 డివిజన్లలోనూ వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వారిలో కొందరు జనసేనలోనూ, టీడీపీలోనూ చేరిపోయారు. భూమన అభినయ్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్‌ పదవికి ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగాయి. 48 మందికి గానూ 26 మంది కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణకు మద్దతివ్వడంతో ఆయన వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్‌ను ఓడించి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

ఏప్రిల్‌ 16

ఎరుపెక్కిన తిరుపతి

తిరుపతి కేంద్రంగా ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలు వైభవంగా మొదలయ్యాయి. కచ్చపి ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ పార్టీ యువ శ్రేణులు తరలివచ్చాయి. కీలక చర్చలతో పాటు ఆటాపాటాలతో యువ కామ్రేడ్‌లు సందడి చేశారు. ఎర్ర జెండాలు, తోరణాలతో తిరుపతి నగరం రెపరెపలాడింది. డిసెంబరు 17 నుంచి మూడు రోజుల పాటు ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర మహాసభలు కూడా అట్టహాసంగా జరిగాయి.

మే 7

లోకేశ్‌ సత్యవేడు యాత్ర

నారా లోకేశ్‌ సత్యవేడు సందర్శన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నాయకత్వ గందరగోళంలో సతమతమవుతున్న కేడర్‌కి భరోసా ఇచ్చింది. ఈ పర్యటనలో ఆయన కార్యకర్తలు, నాయకులు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. అండగా వుంటానని, అధైర్యపడవద్దని ఽహామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో వున్నపుడు, గత ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ప్రశంసా పత్రాలు అందజేసి ఉత్తేజం నింపారు. ఇందుకు అనుగుణంగానే జూలై 2న కూరపాటి శంకర్‌రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌గా పార్టీ ప్రకటించింది.

జూలై 12

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి నగరం వినుత డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో వినుత, ఆమె భర్త అరెస్టయ్యారు. జూలై 11న వారిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండుకు పంపించారు. జనసేన నుంచి వినుతను బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికీ వినుతకు నడుమ ఈ అంశంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి.

అక్టోబరు 26

లక్కీ ఛాన్స్‌!

శ్రీకాళహస్తి జనసేన కార్యకర్త కొట్టే సాయిని శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. వినుత తెరమరుగు అయ్యాక జనసేనలో కీలక నేతగా ఈయన ఎదిగారు. వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి పోలీసుల నుంచి ఎదుర్కొన్న వేధింపులుతో కొట్టే సాయి పాపులర్‌ అయ్యారు.

మే 13

త్రిబుల్‌ ధమాకా

డాలర్స్‌ దివాకర్‌రెడ్డి గారెల బుట్టలో పడ్డారు. మే 13న తుడా ఛైర్మన్‌ పదవి అందుకున్నారు. టీటీడీ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. డిసెంబరు 21న తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

భూమన.. ఉక్కిరి బిక్కిరి

టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఇది విచారణ నామ సంవత్సరంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు ప్రధాన కేసుల్లోనూ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ గోశాలలో సరైన ఆహారం, వైద్యం అందక పెద్దసంఖ్యలో గోవులు మరణించాయని చేసిన ఆరోపణలపై ఎస్వీయూ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో అక్టోబరు 24న ఆ స్టేషన్‌ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అలాగే పరకామణి చోరీ కేసులో నవంబరు 25న తిరుపతిలో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కల్తీ నెయ్యి కేసులో డిసెంబరు 27న సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు.

పదవులొచ్చాయి

జనవరి 21: తిరుపతికి చెందిన సామంచి శ్రీనివాస్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా నియమితులయ్యారు.

మే 11: తిరుపతి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

మే 12: తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడుగా నియమితులయ్యారు.

సెప్టెంబరు 11: తిరుపతి టీడీపీ యువనేత మహేశ్‌ యాదవ్‌ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

అక్టోబరు 5: సిపిఐ జిల్లా కార్యదర్శిగా పి.మురళీ వరుసగా రెండవ సారి ఎన్నికయ్యారు.

అక్టోబరు 23: సిపిఐ కీలక నేత కె.నారాయణ ఆ పార్టీ జాతీయ కంట్రోల్‌ మిషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

నవంబరు 5: తిరుపతికి చెందిన ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

డిసెంబరు 11: శ్రీకాళహస్తి టీడీపీ నేత రెడ్డివారి గురవారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడుగా నియమితులయ్యారు.

డిసెంబరు 21: కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీ అధ్యక్షరాలుగా నియమితులయ్యారు.

-

ప్రెసిడెంట్‌

రాష్ట్రపతి రెండుసార్లు వచ్చారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 20న తిరుపతి వచ్చారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకుని రాత్రికి తిరుమలలో బస చేశారు. 21న భూ వరాహస్వామిని, శ్రీవారిని దర్శించుకుని వెనుదిరిగారు. డిసెంబరు 17న మళ్లీ రేణిగుంటలో విమానం దిగి హెలికాప్టర్‌లో వేలూరు స్వర్ణ దేవాలయ సందర్శనకు వెళ్లారు.

సీఎం

సీఎం బాబు సెవెన్‌ ట్రిప్స్‌

సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఏడాదిలో ఏడుసార్లు జిల్లాకు వచ్చారు. జనవరి 9న తిరుపతిలో తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఫిబ్రవరి 17న తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కనెక్ట్‌ సదస్సులో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజున మార్చి 21న మళ్లీ కుటుంబం సహా తిరుమలకు వచ్చారు. సెప్టెంబరు 24న తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జూలై 20న తిరుపతిలో స్వర్ణ ఆంధ్ర... స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబరు 26న తిరుపతి సంస్కృత యూనివర్శిటీలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-------

పవన్‌

డిప్యూటీ సీఎం పవన్‌ ఫోర్‌ టైమ్స్‌

జనవరి 9న తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధితులను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. నవంబరు 8న రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఎర్రచందనం గోదామును తనిఖీ చేశారు. కలెక్టరేట్‌లో రాయలసీమ జిల్లాల అధికారులతో ఎర్రచందనం అక్రమ రవాణాపై సమీక్షించారు. నవంబరు 9న విమానంలో రేణిగుంటకు వచ్చి రోడ్డు మార్గాన పలమనేరు పర్యటనకు వెళ్ళి వచ్చారు. డిసెంబరు 4న మళ్లీ రేణిగుంట విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గాన చిత్తూరు పర్యటనకు వెళ్ళి వచ్చారు.

------

జగన్‌

మాజీ సీఎం జగన్‌ ఒకే ఒక్కసారి

మాజీ అయ్యాక వైఎస్‌ జగన్‌ ఒకే ఒక్కసారి జిల్లాకు వచ్చారు. జనవరి 9న తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించారు.

---------

ఆదిమూలం

త్రిశంకు పదవి

మహిళా నాయకురాలి లైంగిక ఆరోపణలతో టీడీపీ నుంచి సస్పెండ్‌ అయినకోనేటి ఆదిమూలం పవర్‌లేని ఎమ్యెల్యేగా సత్యవేడులో కొనసాగుతున్నారు. నియోజకవర్గం ఇన్‌చార్జిగా శంకర్‌రెడ్డిని పార్టీ నియమించింది. అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎమ్మెల్యేగా తనను గుర్తించడంలేదని ఆయన తరచూ ఆగ్రహ ఆవేదనలు ప్రకటిస్తున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 01:18 AM