ప్రజలకు మరింత చేరువగా పోలీసు వాట్సాప్ సేవలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:33 AM
జిల్లా పోలీసుశాఖ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా 94906 17873 నెంబరును కేటాయించింది. జిల్లా.. సబ్‌డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది. ఎక్కడ, ఎలాంటి నేర ఘటనలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేస్తే చాలు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు.

ప్రాథమికంగా జిల్లా స్థాయిలో 172, సబ్ డివిజన్ స్థాయిలో 354 గ్రూపులు ఏర్పాటు
6 నెలల్లో 2 లక్షల మందిని చేర్చేలా చర్యలు
జిల్లా పోలీసుశాఖ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా 94906 17873 నెంబరును కేటాయించింది. జిల్లా.. సబ్‌డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది. ఎక్కడ, ఎలాంటి నేర ఘటనలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేస్తే చాలు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. అదే ఆలోచనతో ఎస్పీ హర్షవర్ధనరాజు పోలీసు శాఖలోనూ వాట్సాప్ సేవలు ప్రారంభించారు. జిల్లాలోని మారుమూల పల్లెల నుంచి పట్ణణాల వరకు పోలీసు వాట్సాప్ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తద్వారా పోలీసులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, ఎక్కడ నేరాలు జరిగినా, దోపిడీలు, దొంగతనాలు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, చైన్ స్నాచింగ్‌లు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక పరమైన నేరాలు, భూ ఆక్రమణలు, దందాలు.. ఇలా ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు తెలిపి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి వాట్సాప్ సేవలు ఉపయోగపడతాయి. స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కవులు, రచయితలు, సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులు, ఆటో, లారీ, కారు, బస్సు డ్రైవర్ల యూనియన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఇలా అన్ని రకాల వర్గాలను గ్రూపుల్లో చేర్చనున్నారు. వారి నుంచి అవసరమైన సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సబ్ డివిజన్ స్థాయిలో 354 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాటి ద్వారా దాదాపు 54,210 మంది సభ్యులను చేర్చారు. ఎస్పీ నేతృత్వంలోని జిల్లా స్థాయి గ్రూపులో 172 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాటి ద్వారా దాదాపు 25,000 మందిని చేర్చారు. రానున్న ఆరు నెలల కాలంలో రెండు లక్షల మందిని సభ్యులుగా చేర్చేదిశగా చర్యలు చేపట్టారు. వాట్సాప్ గ్రూపులపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడానికి త్వరలో పట్టణాలు, పల్లెలు, నగరాల్లోని సర్కిళ్ళు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్ళు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు వద్ద ఫ్లెక్సీలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా సంబంధిత పోలీసులు ఆయా గ్రూపుల్లో ఫొటోలు, నేరాలు జరిగిన తీరుపై సమాచారం అందులో పోస్టు చేస్తారు. తద్వారా మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు, వ్యాపారులు, వర్తక వాణిజ్య సంస్థల ప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశాలు వుంటాయని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.