నేటి నుంచి పోలేరమ్మ జాతర
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:38 AM
పోలేరమ్మ పుట్టినిల్లు కుమ్మరిల్లు. మెట్టినిల్లు చాకలిల్లు. ఇలా 18 కులాల భాగస్వామ్యంతో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర బుధవారం మొదలు కానుంది. ఒక్కో కులానికి ఒక్కో బాధ్యత ఉంటుంది. కుల, మత సామరస్యతకు ఈ జాతర ప్రతీక. దేశ, విదేశాల్లోని బంధుమిత్రులు తరలివచ్చి వారం రోజులపాటు సంతోషంగా గడిపేందుకు ఈ జాతర ఒక వేదిక. బుధ, గురువారాల్లో పోలేరమ్మ జాతర జరిగినా.. ఆదివారం ఘటోత్సవంతోనే వెంకటగిరిలో సందడి మొదలైంది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో జాతర వాతావరణం నెలకొంది. ఇక, బుధవారం తెల్లవారే అమ్మవారి పుట్టినింటి వారైన కుమ్మరి వారు వెంకటగిరి చెరువు నుంచి బంకమట్టి తీసుకు రానున్నారు. మధ్యాహ్నం రాహుకాలం ముగిశాక ఆ మట్టిని పసుపుతో కలిపి సాయంత్రం 4 నుంచి 6 గంటల్లోపు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. కళ్లు, దిష్టి చుక్క ఎటువంటి అలంకారం లేకుండా భక్తుల దర్శనార్థం ఉంచుతారు.
మత సామరస్యానికి ప్రతీక
బంధుమిత్రుల సంగమ వేదిక
రాత్రికి కొలువుదీరనున్న అమ్మవారు
వెంకటగిరి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలేరమ్మ పుట్టినిల్లు కుమ్మరిల్లు. మెట్టినిల్లు చాకలిల్లు. ఇలా 18 కులాల భాగస్వామ్యంతో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర బుధవారం మొదలు కానుంది. ఒక్కో కులానికి ఒక్కో బాధ్యత ఉంటుంది. కుల, మత సామరస్యతకు ఈ జాతర ప్రతీక. దేశ, విదేశాల్లోని బంధుమిత్రులు తరలివచ్చి వారం రోజులపాటు సంతోషంగా గడిపేందుకు ఈ జాతర ఒక వేదిక. బుధ, గురువారాల్లో పోలేరమ్మ జాతర జరిగినా.. ఆదివారం ఘటోత్సవంతోనే వెంకటగిరిలో సందడి మొదలైంది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో జాతర వాతావరణం నెలకొంది. ఇక, బుధవారం తెల్లవారే అమ్మవారి పుట్టినింటి వారైన కుమ్మరి వారు వెంకటగిరి చెరువు నుంచి బంకమట్టి తీసుకు రానున్నారు. మధ్యాహ్నం రాహుకాలం ముగిశాక ఆ మట్టిని పసుపుతో కలిపి సాయంత్రం 4 నుంచి 6 గంటల్లోపు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. కళ్లు, దిష్టి చుక్క ఎటువంటి అలంకారం లేకుండా భక్తుల దర్శనార్థం ఉంచుతారు. అక్కడి నుంచి అమ్మవారి ప్రతిమకు తెల్లగుడ్డతో ముసుగు వేసి కట్టెలతో చేసిన పల్లకిపై అమ్మవారి అత్తవారిల్లుగా భావించే జీనిగలవారి వీధిలోని చాకలింటి వద్దకు రాత్రి 9.30 నుంచి 10.30 గంటలకు తీసుకెళతారు. పురవీధుల్లో ఊరేగుతూ పూజలందుకుంటున్న అమ్మవారి విశ్వరూపంగా భావించే బలి దున్నపోతు, ఘటుంకుండలు కాంపాళెంకు వచ్చి అరవపాళేనికి చేరుకొవడంతో ఘటుం కార్యక్రమం ముగుస్తుంది. సుమారు 11 గంటల సమయంలో కాంపాళెం వద్ద అమ్మవారి అప్పచెల్లెళ్లుగా భావించే గాలిగంగలకు పూజలు చేసి పొట్టేలును బలిచ్చి అమ్మవారికి తొలి నైవేద్యం చెల్లించడంతో పాటు ఆచార సంప్రదాయాలతో గాలిగంగల సారెలను ముగిస్తారు. గాలిగంగలు జీనిగలవారి వీధిలోని చాకలింటికి చెరుకొని అమ్మవారి ముందు నిలవడంతో కోడి తలను నోటితో కొరికి అమ్మవారికి కళ్ళు, దిష్టిచుక్కను ఏర్పాటు చేసి ఆభరణాలతో అలంకరిస్తారు. విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన చప్పరంపై అమ్మవారిని ఊరేగింపుగా తీసుకు వచ్చి గురువారం తెల్లవారు జామున పోలేరమ్మ దేవస్థానం వద్ద వేపమండలతో సిద్ధం చేసిన మండపంలో కొలువుదీర్చనున్నారు. అమ్మవారిని గురువారం భక్తులు దర్శించుకుంటారు.
ఆచార సంప్రదాయాలు పాటిస్తూ..
పోలేరమ్మ జాతర అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఆ ప్రకారం.. జాతర సందర్భంగా ఇళ్లలో నట్టింట గోడపై ఎర్రమటితో అలికి పసుపు కుంకుమతో అమ్మవారి ప్రతిమను సిద్ధంచేసి పూజలు చేస్తారు. అంబలితో పాటు కరవాడు, వంకాయ పులుసును అమ్మవారి నైవేద్యంగా సమర్పిస్తారు. చిన్నా, పెద్ద.. బీదా, ధనిక తేడా లేకుండా బుట్టలు, గిన్నెలు చేతబట్టి ఇలిల్లూ తిరుగుతూ పోలేరమ్మకు మడి భిక్షం పెట్టండంటూ భిక్షాటన చేసి మొక్కులు చెల్లించుకొంటారు.