Share News

‘పరకామణి’తో పరాచకాలా..!

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:27 AM

పరకామణి దొంగతనాన్ని చాలా చిన్నదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుపతిలోని కూటమి నేతలు శుక్రవారం ఆయనపై ధ్వజమెత్తారు. ‘పరకామణి’తో పరాచకాలేంటి జగన్‌ అంటూ ధ్వజమెత్తారు.

‘పరకామణి’తో పరాచకాలా..!

పరకామణి దొంగతనాన్ని చాలా చిన్నదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుపతిలోని కూటమి నేతలు శుక్రవారం ఆయనపై ధ్వజమెత్తారు. ‘పరకామణి’తో పరాచకాలేంటి జగన్‌ అంటూ ధ్వజమెత్తారు. ఎవరేమన్నారంటే..

- తిరుపతి/తిరుపతి (జీవకోన), ఆంధ్రజ్యోతి

గజదొంగకు చిన్నదే కావచ్చు

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేలకోట్లు సంపాదించిన గజదొంగకు పరకామణి చోరీ చిన్నదే కావచ్చు. క్రిస్టియన్‌గా శ్రీవారి దర్శనానికి వెళితే ఒక్కసారి కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టని వ్యక్తికి ఇది చిన్నదే కావచ్చు. కానీ, కోట్లాదిమంది హిందువులకు మాత్రం ఇది పెద్ద విషయమే.

- పట్టాభి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌

ఆర్థిక నేరస్థుడికి ఇదేమి లెక్క

వైసీపీ నేత జగన్మోహన్‌ రెడ్డి మాటలకు శ్రీవారి భక్తులు దిగ్ర్భాంతికి గురయ్యారు. పెద్ద ఆర్థిక నేరస్థుడికి పరకామణి దొంగతనం కేసు తక్కువే కదా! శ్రీవారి చెంత దాదాపు రూ100కోట్లు నొక్కేస్తే చాలా చిన్నవిషయమా? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? పరకామణి కేసులో నలుగురు తోడు దొంగలు ఉండారని ఆధారాలతో సహా చూపించినా తనని ఒక్కరినే విచారిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి అనడం విడ్డూరంగా ఉంది.

- సుగుణమ్మ, ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌

చర్చిలో జరిగితే ఇలాగే స్పందిస్తారా

రూపాయి దొంగలించినా అది పవిత్రమైన స్వామి సొత్తు. అది మీ దృష్టిలో చిన్న చోరీనా? లక్షలకోట్లు కొల్లకొట్టి బెయిల్‌పై ఉన్న మీకు అదిచిన్నదిగానే కావచ్చు. ఏసుప్రభు దగ్గర జరిగివుంటే ఇదేవిధంగా స్పందన ఉండేదా? కోట్లాదిమంది హిందువులు బాధపడేవిధంగా మాట్లాడారు. పరకామణి అంశంలో ప్రజాభిప్రాయానికి వెళ్లే దమ్ముందా?

- భానుప్రకాష్‌ రెడ్డి, టీటీడీ సభ్యుడు

చిల్లర కేసుగా మాట్లాడతావా?

రూ.వందల కోట్లు దోచేసిన పరకామని కేసును చిల్లర కేసుగా మాట్లాడటం ఏంటీ? స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడతావా? నీ బంధువు భూమన, మీ బాబాయి వైవీ, నీ వాళ్లు ధనంజయరెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి కాజేసిన డబ్బును అప్పనంగా పంచేసుకుంటే.. నీవేమో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తావా?

- రవినాయుడు, శాప్‌ చైర్మన్‌

ఐఏఎస్‌ అధికారులంటే లెక్కలేదా?

సీఎంగా పనిచేసిన జగన్‌ రెడ్డి.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను వాడు, వీడు అని పలకడం దారుణం. అందులోనూ యాదవ కులానికి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్యను తూలనాడారు. యాదవులందరికీ క్షమాపణ చెప్పాలి. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరగడం వల్లే నాణ్యత లోపించిందని ఎన్నికల సభల్లో చెప్పాను. ఇప్పుడది బహిర్గతమైంది.

- నరసింహ యాదవ్‌, యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

శ్రీవారి కానుకలంటే లెక్కలేదా?

దేశ నలుమూలల నుంచి నిత్యం వచ్చే లక్షలాదిమంది భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలాంటి పవిత్రమైన పరకామణి లెక్కింపులో దొంగతనం జరిగితే జగన్‌రెడ్డి లెక్కలేకుండా మాట్లాడతారా? 11 సీట్లు వచ్చినప్పుడే మానసిక పరిస్థితి దెబ్బతింది. ఇప్పుడది నిజమని స్పష్టమైంది. హిందువులకు క్షమాపణ చెప్పాలి.

- ఆర్సీ మునికృష్ణ, డిప్యూటీ మేయర్‌, తిరుపతి

ఏనుగులు తిన్నోడికి పీనుగులు ఒక లెక్క

లక్షల కోట్లు దోచేస్తేనే జగన్‌ దృష్టిలో దొంగ. ఏనుగులు తిన్నోడికి పీనుగులు ఒక లెక్కా. పరకామణి దొంగను ఆయన అయ్యోపాపం అంటున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోండి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను వాడు, వీడు అంటారా? వాళ్లేమన్నా తాడేపల్లి ప్యాలె్‌సలో చదువుకున్నారా? వారికి క్షమాపణలు చెప్పాలి. జగన్‌పై వారు కేసులు పెట్టాలి. జగన్‌ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

- కిరణ్‌ రాయల్‌, జనసేన నేత

మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికే..

మా హయాంలో ఉన్న బోర్డు సభ్యులు ఇప్పుడూ కొనసాగుతున్నారు. వారినెందుకు విచారణకు పిలవలేదు. మమ్మల్ని దోషులుగా చూపడానికే అధికారులు పనిచేశారు. రవికుమార్‌ తన ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసి టీటీడీకి ఇస్తే.. అప్పటి అధికారులకు ఏం సంబంధం? రవికుమార్‌వి అవినీతి ఆస్తులైతే ఎందుకు అతడికి తిరిగి ఇవ్వలేదు. టీటీడీలో ఓ రూల్‌ ఉంది. డోనర్స్‌ పూర్వాపరాలు తెలుసుకోదు.

- భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌

Updated Date - Dec 06 , 2025 | 01:27 AM