పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:18 AM
ఉదయం లక్ష కుంకుమార్చన రేపు ధ్వజారోహణంతో వాహన సేవలు
తిరుచానూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దేవేరి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. సోమవారం నుంచి జరిగే ఉత్సవాలకు తిరుచానూరు సిద్ధమైంది. అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు అమ్మవారి అష్టోత్తర శతనామావళిని లక్ష సార్లు జపిస్తూ కుంకుమార్చన చేస్తారు. ఈ సేవలో పాల్గొనదలచిన దంపతులు రూ.1116 టిక్కెట్ కొనాలి. కుంకుమార్చనను భక్తులు కూర్చొని తిలకించేందుకు వీలుగా మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక, తొమ్మిది రోజుల పాటు ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకుండా బ్రహ్మోత్సవాలు జరగాలని సకల దేవతలను, అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తూ సాయంత్రం అంకురార్పణ గావిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారికి, విష్వక్సేనుడికి ఆలయంలో పూజలుచేస్తారు. అమ్మవారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఉద్యానవనానికి వేంచేపు చేస్తారు. వెంట సర్వసేనాధిపతి విష్వక్సేనుడూ చేరుకుంటారు. అక్కడి పుట్టమట్టి సేకరించి ఆలయంలోని యాగశాలకు చేరుకుని పాలికల్లో పుట్టమట్టి, నవధాన్యాలు నింపి అంకురార్పణ చేస్తారు.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
సోమవారం ఉదయం 8-9 గంటల మధ్య ధనుర్లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. గజ పటాన్ని ధ్వజస్తంభానికి ఆరోహణం చేస్తారు. దీంతో ఉత్సవాలకు సకలదేవతలను ఆహ్వానిస్తారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి ఏడు గంటలకు చిన్నశేషవాహనంతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు అమ్మవారు వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతున్నారు. ఆయావాహనాలను సిద్ధం చేశారు. విద్యుద్దీపాలంకరణలతో తిరుచానూరు దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.
వాహన సేవలిలా..
తొలిరోజైన 17వ తేది సాయంత్రం చిన్నశేషవాహనం, 18న పెద్దశేష హంస.. 19న ముత్యపుపందిరి, సింహ.. 20న కల్పవృక్ష, హనుమంత.. 21న పల్లకీ ఉత్సవం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి గజవాహనం.. 22న సర్వభూపాల, సాయంత్రం స్వర్ణరథోత్సవం రాత్రి గరుడ వాహనం.. 23న సూర్యప్రభ, చంద్రప్రభ.. 24న రథోత్సవం, అశ్వవాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు. దీంతో వాహన సేవలు ముగుస్తాయి. 25న మధ్యాహ్నం 12.10 గంటలకు పంచమితీర్థం(చక్రస్నానం), సాయంత్రం ధ్వజావరోహణం, 26న పుష్పయాగం జరగనుంది.
పది రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పది రోజులపాటు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్ తెలిపారు. కుంకుమార్చన, వీఐపీ బ్రేక్, కల్యాణోత్సవంతో పాటు వారపు, మాసపు ఆర్జిత సేవలు ఉండవన్నారు. ఈనెల 27 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయని వివరించారు.