Share News

మతి స్థిమితంలేని వ్యక్తుల నియంత్రణకు ప్రణాళిక

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:33 AM

తిరుపతిలో సోమవారం సైకో వీరంగంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరునగరిలో భిక్షగాళ్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు, సైకోల ఏరివేతకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

మతి స్థిమితంలేని వ్యక్తుల నియంత్రణకు ప్రణాళిక

తిరుపతి(నేరవిభాగం), జూలై 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం సైకో వీరంగంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరునగరిలో భిక్షగాళ్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు, సైకోల ఏరివేతకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా తిరుపతి ఈస్ట్‌, అలిపిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఎక్కువగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎక్కడ తల దాచుకుంటున్నారనేది పరిశీలించి ఎంఆర్‌పల్లెలోని బెగ్గర్ల షెల్టర్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో 60 నుంచి 70మంది భిక్షగాళ్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరితో పాటు మతిస్థిమితం లేని వ్యక్తులున్నారు. వీరిని చట్ట ప్రకారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి ఆస్పత్రికి తరలించి వారి మానసిక స్థితిపై సర్టిఫికెట్‌ తీసుకున్నాక అవసరమైన వారిని వైజాగ్‌లోని ఆస్పత్రికి తరలించడానికి పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. మతిస్థిమితం లేని వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీ్‌సస్టేషన్‌కు సమాచారమివ్వాలని డీఎస్పీ భక్తవత్సలం విజ్ఞప్తి చేశారు.

మతిస్థిమితం లేకనే హత్య

తిరుపతి కపిలతీర్థం సమీపంలో సోమవారం కత్తి, కర్రతో వీరంగం సృష్టించి ఒకరి హత్యకు.. ఇద్దరు గాయపడటానికి కారణమైన వ్యక్తిని మంగళవారం రుయాస్పత్రికి తరలించారు. ఇతడిని పరీక్షించిన వైద్యులు.. మానసిక స్థిమితం లేదని నిర్ధారించారని అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌ చెప్పారు. అతడిని బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరు పరచి న్యాయమూర్తి ఆదేశాలతో వైజాగ్‌లోని మెంటల్‌ ఆస్పత్రికి తరలించనున్నామన్నారు.

చిత్తూరులో బిచ్చగాడిని చంపిన మరో బిచ్చగాడు

చిత్తూరు అర్బన్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): బిచ్చగాడిని మరో బిచ్చగాడు రాడ్డుతో కొట్టి చంపిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. ఒకటవ పట్టణ పోలీసుల వివరాల మేరకు.. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన లోకేష్‌, జీడీ నెల్లూరు మండలం కోటాగరానికి చెందిన దివ్యాంగుడైన రాజేంద్రలు నగరంలో వివిధ ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోస్టాఫీసు వీధికి ఎదురుగా ఉన్న క్రాంతి ఫొటో స్టూడియో పక్కనే టీ దుకాణం వద్దకు ఇద్దరు చేరుకున్నారు. ఈ సమయంలో ఇద్దరికీ మాటామాట పెరిగడంతో ఆగ్రహానికి గురైన లోకేష్‌ పక్కనే ఉన్న రాడ్డుతో రాజేంద్ర తలపై బాదాడు. దాంతో రాజేంద్ర అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 01:33 AM