Share News

పుంగనూరుకు బదులు పీలేరు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:36 PM

పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది

 పుంగనూరుకు బదులు పీలేరు

చిత్తూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాల పునర్విభజన, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం రాజధానిలో సమావేశమైంది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మార్పు చేర్పుల గురించి చర్చించింది.ఇటీవల సీఎం చంద్రబాబుతో సబ్‌ కమిటీ సమావేశమై ప్రాథమిక ప్రతిపాదనల్ని ఆయన ముందుంచింది. ఆయన చేసిన సూచనలతో ప్రతిపాదనల్లో మార్పులు చేసింది. గతంలో పుంగనూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసి, ఆ నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఆ డివిజన్‌లో ఉంచాలని ప్రతిపాదించారు. తాజాగా పుంగనూరుకు బదులుగా పీలేరు కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. పీలేరు సబ్‌ డివిజన్‌లో ఏయే మండలాలు ఉంటాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పుంగనూరును మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో కలుపుతూ ఆరు నెలల ముందే చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

పీలేరుకు మహర్దశ

మదనపల్లె కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు గురించి కూడా సబ్‌ కమిటీ చర్చించింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో పాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాన్ని కూడా కలిపేసి జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధం చేశారు. దాన్ని సీఎం చంద్రబాబు ఫైనల్‌ చేయాల్సి ఉంది. మదనపల్లె జిల్లా అయితే నాలుగు నియోజకవర్గాలు, రెండు (మదనపల్లె, పీలేరు) రెవెన్యూ సబ్‌ డివిజన్లు ఉంటాయి. పోలీసు సబ్‌ డివిజన్లను కూడా పెంచే అవకాశాలున్నాయి. పీలేరును రెవెన్యూ డివిజన్‌తో పాటు పోలీసు సబ్‌ డివిజన్‌గా కూడా మార్చవచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు దీన్ని మున్సిపాలిటీగా కూడా మార్చే అవకాశాలు లేకపోలేదు.

ఈ నిర్ణయాల్లో మార్పు లేనట్టే

నగరి నియోజకవర్గం మొత్తాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేందుకు ఇది వరకే చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా ప్రతిపాదన పంపివున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి రాజంపేటకు మార్చే నిర్ణయంలోనూ మార్పు లేదని తెలుస్తోంది. మదనపల్లె జిల్లాగా ఏర్పడితే అన్నమయ్య జిల్లాలో మూడు నియోజకవర్గాలు రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు మాత్రమే మిగిలి ఉంటాయి. మూడింటితోనే జిల్లా ఉంటుందా.. కడపలోని ఏదైనా ఓ నియోజకవర్గాన్ని కలిపి నాలుగు చేస్తారా అనే విషయంలో స్పష్టత లేదు.

Updated Date - Nov 05 , 2025 | 11:36 PM