విద్యార్థినుల పట్ల పీఈటీ దాష్టీకం
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:46 AM
వైట్ యూనిఫాం ధరించలేదని విద్యార్థునుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఒక్కో విద్యార్థిని చేత 150 గుంజిళ్లు తీయించాడు. బూతులు తిడుతూ కర్రతో వాతలు తేలేలా చితకబాదాడు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా దాచినప్పటికీ పీఈటీ కొట్టిన దెబ్బలకు నొప్పులు తాళలేక విద్యార్థినులు విలపిస్తూ వార్డెన్‌కు చెప్పారు.
అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థినులు
కోట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వైట్ యూనిఫాం ధరించలేదని విద్యార్థునుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఒక్కో విద్యార్థిని చేత 150 గుంజిళ్లు తీయించాడు. బూతులు తిడుతూ కర్రతో వాతలు తేలేలా చితకబాదాడు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా దాచినప్పటికీ పీఈటీ కొట్టిన దెబ్బలకు నొప్పులు తాళలేక విద్యార్థినులు విలపిస్తూ వార్డెన్‌కు చెప్పారు. ఇంతలో కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోట ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎస్సీ బాలికల వసతిగృహంలో 160 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరంతా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తగరతుల వరకు చదువుకుంటున్నారు. శనివారం ఉదయం రోజూలాగే గ్రీన్ యూనిఫారం ధరించి పాఠశాలకు వెళ్లారు. ప్రార్థన సమయంలో వైట్ యూనిఫాం వేసుకురాని విద్యార్థినులను వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ ప్రశ్నించారు. ఇప్పటివరకు హాస్టల్‌లో వైట్ యూనిఫారం ఇవ్వలేదని విద్యార్థినులు చెప్పడంతో కోపోద్రిక్తుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు 60మంది హాస్టల్ విద్యార్థినుల చేత 150 గుంజిళ్లు తీయించాడు. అంతేకాకుండా కర్రతో ఆ విద్యార్థినులను కాళ్లమీద, వెనుక భాగంలో తీవ్రంగా కొట్టాడు. కన్నీటి పర్యంతమైన విద్యార్థినులు సాయంత్రం 5 గంటలకు హాస్టల్‌కు వెళ్లారు. రాత్రి అయ్యేసరికి పీఈటీ మాస్టర్ కొట్టిన దెబ్బలకు కాళ్లు, తోడలు వాచిపోయి నొప్పులు భరించలేక విద్యార్థినులు ఏడ్పులు మొదలుపెట్టారు. విచారించిన వార్డెన్ ఉషారాణి హెచ్‌ఎం భారతిని, పాఠశాలలోని ఉపాధ్యాయులను ప్రశ్నించినా సక్రమంగా సమాధానం చెప్పలేదు. విద్యార్థినులు వెక్కివెక్కి ఎడుస్తుండటంతో దళిత సంఘాల నాయకులు, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్, సురేష్ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులను విచారించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను 108 వాహనంలో కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు వార్డెన్ ఉషారాణి ఆధ్వర్యంలో వసతి గృహంలోనే చికిత్స అందించారు. ఎంఈవో మస్తానయ్య హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.