‘చలి’ంచిపోతున్న జనం
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:03 AM
ఈ ఏడాది మున్నెన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఈనెల ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతోంది. పదేళ్లల్లో ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఈనెలాఖరున, జనవరి ఆరంభంలో కొద్ది రోజులు పాటు 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
పదేళ్లలో లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు
గజగజ వణుకుతున్న ప్రజానీకం
చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
చిత్తూరు రూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మున్నెన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఈనెల ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతోంది. పదేళ్లల్లో ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఈనెలాఖరున, జనవరి ఆరంభంలో కొద్ది రోజులు పాటు 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇందుకు భిన్నంగా గత 20 రోజులు నుంచి చీకటిపడగానే మంచు కురుస్తోంది. ఉదయం 7 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించడంలేదు. సాయంత్ర 4 గంటల నుంచే చలి మొదలుకావడంతో ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు.
ఫచిన్నారులపై చలి పంజా
చలి తీవ్రత పెరగడంతోపాటు చిన్నారులు జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. చిత్తూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు బిడ్డలతో తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. 2-3 ఏళ్లలోపు వారిలో బ్రాంకో నిమోనియా వ్యాపిస్తోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సాదారణంగా రోజూ సగటున 100కు పైగా ఓపీలు దాటుతున్నాయి.
ఫ తగ్గిన విద్యుత్ వినియోగం
చలి తీవ్రతతొ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పడిపోయింది. ఉదయం గీజర్లు వాడుతున్నా, మిగతా సమయాల్లో తక్కువ వాడకం నమోదువుతోందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా ఈ ఏడాది మేలో 38.17 మిలియన్ యూనిట్లు వాడితే ఈ నెల 21వ తేది వరకు 27.72 మిలియన్ యూనిట్లు విద్యుత్తు వాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫ జాగ్రత్తలు...
ఫ ఏడాదిలోపు చిన్నారులను పట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తల్లిపాలే అందించాలి.
ఫ సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు గంటల వరకు బయటకు తీసుకెళ్లకూడదు.
ఫ రాత్రి సమయాల్లో ఏసీల వినియోగం పూర్తిగా మానేయాలి. గదుల్లో ఫ్యాన్ల వేగం తగ్గించాలి.
ఫ చల్లని పదార్థాలను పెట్టకూడదు. గోరువెచ్చని నీళ్లు తాగించాలి.
ఫ ఆస్తమా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌హేలర్లు వినియోగించాలి.
ఫ చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తిని పెంచేలా పోషకాహారం అందించాలి.
ఫ మూడు రోజులకు మించి జలుబు, దగ్గు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించాలి. ఆలస్యం చేస్తే ఊపిరితిత్తుల్లో రంద్రాల వాచిపోయి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.