పింఛన్ సొమ్ము కార్యదర్శి స్వాహా
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:27 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్మును ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేయడంతో పుంగనూరు మండలం బండ్లపల్లెలో సోమవారం పింఛన్లు అందలేదు.చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ మాదంవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు బండ్లపల్లె గ్రామ పంచాయతీ గ్రేడ్- 5 కార్యదర్శిగా పని చేస్తున్నాడు.
పుంగనూరు, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్మును ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేయడంతో పుంగనూరు మండలం బండ్లపల్లెలో సోమవారం పింఛన్లు అందలేదు.చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ మాదంవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు బండ్లపల్లె గ్రామ పంచాయతీ గ్రేడ్- 5 కార్యదర్శిగా పని చేస్తున్నాడు.152మందికి పింఛన్ అందించేందుకు శనివారం బ్యాంకు నుంచి రూ.6.34లక్షలు డ్రా చేశాడు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్, సిరికల్చర్ అసిస్టెంట్‌తో కలసి పింఛన్లను పంపిణీ చేయాల్సిన శ్రీనివాసులు ఉదయం 11గంటలకు కూడా రాలేదు. పింఛనుదారులు పంచాయతీ కార్యాలయం వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఒక్క పింఛను కూడా పంపిణీ జరగకపోవడంతో ఎంపీడీవో లీలామాధవి ఆరా తీశారు. వెంటనే శ్రీనివాసులు స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వ సొమ్మును ఇవ్వకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే తమకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదని, గతంలో కూడా ఇలా ఎన్నో చేస్తే తాము చెల్లించినట్లు అధికారుల ఎదుట వారు వాపోయారు.దీంతో ఎంపీడీవో వెంటనే చిత్తూరు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవికి సమాచారం ఇవ్వగా కలెక్టర్‌కు నివేదిక ఇస్తానని మంగళవారం ప్రత్యామ్నాయంగా పింఛన్లు పంపిణీ ఏర్పాట్లు చేస్తామని పీడీ చెప్పారు. అదేవిధంగా కార్యదర్శి శ్రీనివాసులును కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా సీఐ సుబ్బరాయుడు కార్యదర్శి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై పింఛను సొమ్ము స్వాహా చేసినట్లు తెలిసింది.