ప్రశాంతంగా రాష్ట్రపతి పర్యటన
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:33 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగిసింది
తిరుమల, నవంబరు21(ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆమె.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ్నుంచి వరాహస్వామి ఆలయానికి వెళ్లేందుకు టీటీడీ బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేసింది. చిరు జల్లుల కురుస్తున్నా.. రాష్ట్రపతి కాలినడకనే వెళ్లి వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి రాష్ట్రపతితోనే రాగా.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అర్చకబృందంతో కలిసి ఇస్తికాఫల్ స్వాగతం పలికారు. గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకున్న ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి, చైర్మన్, ఈవో, అదనపు ఈవోతో పాటు బోర్డు సభ్యులు భానుప్రకా్‌షరెడ్డి, జానకీదేవి, పనబాక లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులున్నారు. సంప్రదాయాన్ని పాటిస్తూ రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాసిబ్బంది పంచె, షర్టుతో ఆలయ ప్రవేశం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్కడక్కడ వాహనాలను ఆపేయడంతో భక్తులు స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. ద్రౌపది ముర్ము దర్శన సమయంలో ఆలయం వద్దకు ఎవరినీ అనుమతించలేదు.
ప్రొటోకాల్ పక్కనపెట్టి
ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి.. రాంభగీచ సర్కిల్ వద్దకు నిలుచుని ఉన్న భక్తులను గమనించారు. ప్రొటోకాల్ పక్కన పెట్టి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి భక్తుల వద్దకు వెళ్లి పలకరించారు. హెచ్‌టీ కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ వెళ్లి భక్తులకు అభివాదం చేశారు. కొందరు పిల్లలకు చాక్లెట్లు పంచారు. అనంతరం గెస్ట్‌హౌ్‌సకు చేరుకున్న ఆమె.. కాసేపు విశ్రాంతి తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్రపతికి సాదర వీడ్కోలు
రేణిగుంట, ఆంధ్రజ్యోతి: తిరుమల నుంచి శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు ఆమెకు సాదర వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.