ప్రశాంతం.. దిగ్విజయం
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:34 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగియడంతో టీటీడీ పాలకమండలి, అధికార యంత్రాంగం ఆనందంగా ఉన్నాయి. విజయవంతం చేశారంటూ ఏకంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయడం విశేషం. ఈ విజయం వెనుక మూడు నెలల ముందస్తు కృషి ఉంది. బ్రహ్మోత్సవాల ముందు బదిలీ అయిన ఈవో శ్యామలరావు, తండ్రి కన్నుమూయడంతో హాజరుకాలేకపోయిన అదనపు ఈవో వెంకయ్యచౌదరిల పాత్ర చాలా ఉంది. ప్రస్తు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కు అయిదు బ్రహ్మోత్సవాలను నిర్వహించిన అనుభం ఉండడం, ముఖ్య అధికారులందరికీ గత బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగం అయిన అనుభవం ఉండడం ఈసారి చిన్న అవాంతరం కూడా లేకుండా విజయవంతం కావడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఈసారి రాజకీయ హడావుడి లేకపోవడం ప్రత్యేకం. ఆ శ్రీనివాసుడే వెనుక ఉండి నడిపించాడని అందరూ ఆనందంగా ఉన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగియడంతో టీటీడీ పాలకమండలి, అధికార యంత్రాంగం ఆనందంగా ఉన్నాయి. విజయవంతం చేశారంటూ ఏకంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయడం విశేషం. ఈ విజయం వెనుక మూడు నెలల ముందస్తు కృషి ఉంది. బ్రహ్మోత్సవాల ముందు బదిలీ అయిన ఈవో శ్యామలరావు, తండ్రి కన్నుమూయడంతో హాజరుకాలేకపోయిన అదనపు ఈవో వెంకయ్యచౌదరిల పాత్ర చాలా ఉంది. ప్రస్తు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కు అయిదు బ్రహ్మోత్సవాలను నిర్వహించిన అనుభం ఉండడం, ముఖ్య అధికారులందరికీ గత బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగం అయిన అనుభవం ఉండడం ఈసారి చిన్న అవాంతరం కూడా లేకుండా విజయవంతం కావడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఈసారి రాజకీయ హడావుడి లేకపోవడం ప్రత్యేకం. ఆ శ్రీనివాసుడే వెనుక ఉండి నడిపించాడని అందరూ ఆనందంగా ఉన్నారు.
తిరుమల, ఆంధ్రజ్యోతి
తోపులాటల్లేని గరుడోత్సవం
బ్రహ్మోత్సవాల్లో పాలకమండలీ, అధికారులూ అత్యంత టెన్షన్‌గా ఉండేది గరుడోత్సవం రోజు. లక్షల మంది జనం ముందే కొండమీదకు చేరుకుంటారు. వీరిలో స్థానికుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వీరికి నీరు, ఆహారం, మరుగుదొడ్ల సౌకర్యం వంటివి లోటు లేకుండా కల్పించాలి. గ్యాలరీల్లోకి ప్రవేశించే సమయంలో తోపులాటలకు అవకాశం ఉంటుంది.
2024లో ముందస్తు ప్రణాళికతో తోపులాటరహిత గరుడోత్సవం రాఘవేంద్రస్వామి మఠానికి సమీపంలో ఏర్పాటు చేసిన అదనపు క్యూలైన్ల ప్రవేశంలో తీవ్రస్థాయిలో తోపులాటలు, తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది టీటీడీ పక్కా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించింది. గ్యాలరీల్లో 2 లక్షల మంది, అదనపు క్యూలైన్లు, రీఫిల్లింగ్ ద్వారా మరో 40 వేల నుంచి 45 వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. శ్రీవారి మూలవిరాట్టు దర్శనానికి మరో 50 వేల మందికి అవకాశం ఉంటుంది. ఇలా 3 లక్షల మందికంటే తిరుమలకు అధికంగా వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అంచనా వేశారు. 28న జరిగిన గరుడవాహనానికి కౌడ్ మెనెజ్మెంట్ సిస్టమ్‌ను అమలుచేసి సక్సెస్ అయ్యారు. తిరుమలకు దాదాపు 3 లక్షల మంది భక్తులు చేరిపోయారని నిర్థారించుకున్న తర్వాత ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు మనిహా మరే ఇతర వాహనం తిరుమలకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కార్లను అలిపిరి వద్దే ఆపేసీ, బస్సులు ఏర్పాటు చేశారు. బస్సుల సంఖ్యను కూడా తగ్గించి నెమ్మదిగా వచ్చేలా ప్లాన్ చేశారు. దీంతో పోటెత్తి పరుగులు తీసే అవసరం కనిపించలేదు. ఫలితంగా తోపులాటరహిత గరుడోత్సవాన్ని నిర్వహించగలిగారు.
అనుభవమే పాఠాలుగా..
గత అనుభవాల నిర్వహణలో అనుభవం ఉన్న అధికారుల ప్రణాళికాబద్ధ కృషి.. ఈఏడాది బ్రహ్మోత్సవాల దిగ్విజయం వెనుక కనిపిస్తోంది. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ గతంతో ఐదు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా గత బ్రహ్మోత్సవంలో లోటుపాట్లను గమనించిన అధికారే. ఇక, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు పాత వారే కావడంతో గతకాలపు లోటుపాట్లను సమీక్షించుకుని ఈసారి వాటన్నింటికీ చెక్ పెట్టగలిగారు. టీటీడీలో గతంలో పనిచేసిన అధికారులు, కీలక బాధ్యతలు నిర్వహించిన సిబ్బంది, కొందరు భక్తులు, మీడియా నుంచి ముందస్తుగా సేకరించిన సమాచారంతో సమర్థవంతమైన ఏర్పాట్లు చేసి సక్సెస్ అయ్యారు. భక్తుల నుంచి ఆకలి అనే మాట వినిపించకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ అందజేసి శభాష్ అనిపించుకున్నారు.
ఆ ఇద్దరి కృషి...
ఈఏడాది బ్రహ్మోత్సవాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలనే లక్ష్యంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మూడునెలలుగా విశేషంగా కృషి చేశారు. అన్ని విభాగాలతో దఫాల వారీగా సమీక్షలు నిర్వహించి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలు ప్రారంభానికి ముందురోజు వరకు సూక్ష్మస్థాయిలో ఏర్పాట్లపై చర్చించారు. దురదృష్టవశాత్తు ధ్వజారోహణం రోజే ఆయన తండ్రి చలమయ్య కన్నుమూయడంతో బ్రహ్మోత్సవాలకు దూరంకావాల్సి వచ్చింది. ఈ సమీక్షల్లో, ఏర్పాట్లలో బ్రహ్మోత్సవాల ముందు బదిలీపై వెళ్లిన ఈవో శ్యామలరావు పాత్ర కూడా చాలానే ఉంది.
వీఐపీల హడావుడి లేదు
సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో రాజకీయ నాయకుల హడావుడి చాలానే ఉంటుంది. వారి బంధువులు, మిత్రులు, అనుచరులు చేసే హంగామా సాధారణ భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వారిని వారించలేక సతమతం అవుతూ ఉంటారు. ఈ ఏడాది మాత్రం వీఐపీల హడావుడి పెద్దగా కనిపించలేదు. హైకోర్టు న్యాయమూర్తులు, ఓ రాష్ట్ర మంత్రి మినహా మిగిలివారెవ్వరు వాహనాల ముందు లేకపోవడంతో వాహనసేవలు ప్రశాంతంగా జరిగాయి.
పెరిగిన ఆర్టీసీ సేవలు
2023 బ్రహ్మోత్సవాల్లో (ఎనిమిది రోజుల్లో) 5.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, గతేడాది 6 లక్షల మందికి దర్శనం లభించింది. కాగా, ఈఏడాది ఎనిమిదిరోజుల్లో 5.80 లక్షల మంది దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 2023లో రూ.24 కోట్లు, 2024లో రూ.26 కోట్లు లభించగా ఈఏడాది రూ.25.12 కోట్లు లభించింది. ఇక ఆర్టీసీ సేవలు ఈ ఏడాది రికార్డు సృష్టించాయి. గతేడాది గరుడసేవ రోజున 1.86 లక్షల మంది తిరుమల-తిరుపతి మఽధ్య ప్రయాణించగా, ఈ ఏడాది రికార్డుస్థాయిలో 2.16 లక్షల మంది ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు.
కళల పండుగ.. కనుల నిండుగ
ఈసారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు దక్షిణాదికి ఈ బ్రహ్మోత్సవాలు పరిచయం చేశాయి. గతేడాది 18 రాష్ర్టాల నుంచి 6,884 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా, ఈ ఏడాది అత్యఽధికంగా 28 రాష్ట్రా నుంచి 6,060 మంది కళాకారులు వాహనాల ముందు ప్రదర్శనలిచ్చారు.
ఫల, పుష్ప ప్రదర్శనలో కొరవడిన కొత్తదనం
కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన శాలకు భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. అయితే కొత్తదనం కొరవడిందనే వ్యాఖ్యలు వినిపించాయి. నాలుగైదేళ్లుగా చేసిన అలంకరణలకు దగ్గరగానే ఈ ఏడాది కూడా ఉన్నాయి. శ్రీకృష్ణలీలల చిత్రాలు కొంత ఆకట్టుకున్నాయి. ప్రతి ఏడాదీ స్థానిక చిత్రకారులతో ఏదో ఒక అంశం మీద చిత్రాలు వేయించి ప్రదర్శనలో ఉంచితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.