ప్చ్.. ఇంకా బాలారిష్టాలే
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:33 AM
జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లవుతున్నా సమకూరని సదుపాయాలు
తిరుపతి, ఆంధ్రజ్యోతి: ఒక గెజిట్ నోటిఫికేషన్‌తో గత వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4 నుంచి తిరుపతి జిల్లాను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. కలెక్టరేట్ సహా వివిధ శాఖల జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను, భవనాల నిర్మాణానికి నిధులనూ కేటాయించలేదు. జిల్లా ఏర్పాటయ్యాక రెండేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తిరుపతి జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లవుతున్నా జిల్లా పాలన బాలారిష్టాలను దాటలేదు.
టీటీడీ భవనంలో 80 శాతం కార్యాలయాలు
కలెక్టరేట్ సహా 80 శాతం కార్యాలయాలు టీటీడీ భవనంలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. శ్రీవారి యాత్రికుల వసతి సముదాయంగా తిరుపతి రూరల్ మండలం దామినేడు సమీపంలో టీటీడీ పద్మావతి నిలయం పేరిట భారీ భవన సముదాయం నిర్మించిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లా ఏర్పాటుతో కలెక్టరేట్‌కు ఈ భవనాన్ని తాత్కాలికంగా కేటాయించారు. నెలకు రూ.28 లక్షలు అద్దె కింద ప్రభుత్వం టీటీడీకి చెల్లించాలి. ఇందులోనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఫారెస్ట్ సెటిల్‌మెంట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్, లీగల్ సెల్, పరిశ్రమలు, అన్ని సంక్షేమ శాఖలు, దేవదాయ, సహకార వంటి శాఖల కార్యాలయాలు వీటిలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి తర్వాత టీటీడీ భవనానికి అద్దె చెల్లించేందుకూ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు.
కొన్నింటికే సొంత భవనాలు
తిరుపతి జిల్లా కాక ముందునుంచీ అర్బన్ పోలీసు జిల్లా కేంద్రంగా ఉంది. దీంతో జిల్లా పోలీసు కార్యాలయం, ఎస్పీ నివాస భవనాలు మాత్రమే ఇటీవల నిర్మాణమయ్యాయి. వాటిని ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతానికి టీటీడీ భవనంలో ఎస్పీ కార్యాలయం నడుస్తోంది.
డీఆర్‌డీఏ, డ్వామా, అటవీ, ట్రెజరీ శాఖలకు మాత్రమే సొంత భవనాల్లో జిల్లా కార్యాలయాలున్నాయి.
డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనే ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలను సర్దుకున్నారు. రవాణా, వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యాలయాలదీ అదే పరిస్థితి.
కలెక్టరేట్‌కు జరగని స్థల సేకరణ
కలెక్టరేట్ భవనాలకు ఇంకా స్థల సేకరణ జరగలేదు. తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లో కొన్ని స్థలాలు ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో స్థల కేటాయింపు కూడా జరగలేదు.
ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం కాబట్టి పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి శాశ్వతంగా కేటాయించేందుకు టీటీడీ ఇదివరకే అంగీకరించింది. రూ. వంద కోట్లు టీటీడీకి చెల్లించి భవనాన్ని కొనే ప్రతిపాదన గత ప్రభుత్వం నుంచే పెండింగులో ఉంది. దీంతో కలెక్టరేట్‌కు శాశ్వత భవనాలు ఎప్పుడు సమకూరుతాయో అంచనా వేయలేని పరిస్థితి.
ముఖ్య అధికారుల నివాస భవనాల విషయానికొస్తే.. మునుపటి కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని కలెక్టర్ బంగ్లాగానూ, ఆర్డీవో బంగ్లాను జేసీ బంగ్లాగా వినియోగిస్తున్నారు. డీఆర్వో, ఆర్డీవోలకు నివాస బంగ్లాలు లేవు.
కొత్త డివిజన్ కేంద్రాలదీ అదే తీరు
జిల్లా పరిధిలో పాతవైన తిరుపతి, గూడూరు డివిజన్లకు సొంత భవనాలున్నాయి. కొత్తగా ఏర్పాటైన శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలకు సొంత భవనాలు లేవు.
శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో నడుస్తోంది. భవన నిర్మాణానికీ స్థల సేకరణ కూడా జరగలేదు. ఆర్డీవో నివాసమూ అద్దె భవనంలోనే. కొత్తగా ఏర్పాటైన డీడీవో కార్యాలయమూ డీఆర్‌డీఏ భవనంలో తాత్కాలికంగా ప్రారంభమైంది. డీఎస్పీ కార్యాలయం సహా మిగతా శాఖల డివిజన్ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి.
సింగిల్ విండో కార్యాలయ భవనంలో సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయాన్ని తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. స్థల సేకరణా జరగలేదు. ఆర్డీవో నివాసమూ అద్దె భవనంలోనే. డీఎస్పీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, కార్మిక శాఖల డివిజన్ కార్యాలయాలు నాయుడుపేటలో ఉన్నాయి. వీటిని సూళ్లూరుపేటకు తరలించే ప్రతిపాదనేదీ రాలేదు. మిగిలిన శాఖల డివిజన్ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
జిల్లాల నడుమ జరగని శాఖలు, సంస్థల విభజన
ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచీ కొన్ని నియోజకవర్గాలను వేరుచేసి తిరుపతి జిల్లా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ కొన్ని శాఖలు, సంస్థలను విభజించలేదు.
జిల్లాలోని 20 మండలాలు చిత్తూరు జడ్పీ పరిధి.. 14 మండలాలు నెల్లూరు జడ్పీ పరిధిలో ఉన్నాయి. తిరుపతి అర్బన్ పోను.. మిగిలిన 19 మండలాల ఎంపీడీవోల బదిలీలు, పదోన్నతులు చిత్తూరు, 14కు సంబంధించి నెల్లూరు జడ్పీ సీఈవో కార్యాలయం నియంత్రిస్తోంది.
రెవెన్యూ శాఖకు సంబంధించి తహసీల్దార్ల బదిలీలు, పదోన్నతులు ఇటు చిత్తూరు కలెక్టర్, అటు నెల్లూరు కలెక్టర్ల పరిధిలోనే ఉన్నాయి. తిరుపతి కలెక్టర్ ప్రతిపాదనల మేరకు వారే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
ఎంఈవోల నియామకం, బదిలీలు, ఉపాఽధ్యాయ బదిలీలు, పోస్టుల భర్తీ వంటివన్నీ చిత్తూరు, నెల్లూరు డీఈవోల నియంత్రణే సాగుతోంది.
జిల్లా సహకార కేంద్రబ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటివీ చిత్తూరు, నెల్లూరు కేంద్రాలుగానే పాలన సాగిస్తున్నాయి.
తిరుపతిలో జరిగే జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరు కావాల్సి వస్తోంది. అధికారిక, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ కూడా రెండు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల పాటించాల్సి వస్తోంది. ఇప్పటికైనా స్పష్టమైన విభజన జరిగి జిల్లాలో పూర్తిస్థాయి పాలన ప్రారంభమైతే తప్ప కొత్త జిల్లా ఏర్పాటు ఉద్దేశం ఆచరణలో నెరవేరే అవకాశం లేదు. ]