Share News

చిత్తూరులో పవన్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:25 AM

తిరుపతిలో భూమన అభినయ్‌ అనుచరుల చేతిలో తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్‌ ఆచూకీ శుక్రవారం లభ్యమైంది. చిత్తూరులోని ఓ లాడ్జీలో బంధించినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని విడిపించి తిరుపతికి తీసుకొచ్చి వాంగ్మూలం తీసుకున్నారు.

చిత్తూరులో పవన్‌
అనిల్‌ను రుయాస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళుతున్న పోలీసులు

వైసీపీ గ్యాంగ్‌ దాడి ఘటనపై విభిన్న కోణాల్లో విచారణ

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో భూమన అభినయ్‌ అనుచరుల చేతిలో తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్‌ ఆచూకీ శుక్రవారం లభ్యమైంది. చిత్తూరులోని ఓ లాడ్జీలో బంధించినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని విడిపించి తిరుపతికి తీసుకొచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. రెంటల్‌ బైక్‌ తీసుకుని అద్దె చెల్లించలేదంటూ వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, వైసీపీ నేతలు దినేష్‌, జగదీశ్వరరెడ్డి, అజయ్‌కుమార్‌ తదితరులు బుధవారం మధ్యాహ్నం దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాధితుడు పులిచెర్ల మండలం మొరవపల్లికి చెందిన పవన్‌కుమార్‌ బుధవారం రాత్రి తప్పించుకుని వెళ్లారు. దినే్‌షతో పాటు పవన్‌కూ కల్లూరు మండలం ఇస్త్రాకులపల్లికి చెందిన జానకిరాం స్నేహితుడు. వీరి నుంచి తప్పించుకెళ్లిన పవన్‌ చిత్తూరు బస్సు ఎక్కగా.. జానకిరాం కూడా అదే బస్సులో కలిసి చిత్తూరుకు బయలుదేరారు. అదే సమయంలో పోలీసు రంగంలోకి దిగడం, తమపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదవడంతో నిందితుల్లో ఒకడైన దినేష్‌ స్పందించాడు. పవన్‌కుమార్‌ను దాచి ఉంచాలని జానకిరామ్‌కు చెప్పాడు. చిత్తూరులో వీరిని రాజు (చిత్తూరుకు చెందిన ఇతడు తిరుపతిలో ప్లాట్ల వ్యాపారం చేస్తూ, వైసీపీ గ్యాంగ్‌తో చేతులు కలిపి ఫైనాన్సు చేస్తున్నాడు) కలిశాడు. కట్టమంచి సమీపం, ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే దారిలోని ఓ లాడ్జిలో గది తీసుకుని పవన్‌ను అందులో బంధించారు. అతడితో పాటు జానకిరాంను ఉంచారు. కేసు నుంచి తప్పించుకునేలా, దళిత సంఘాల ఆందోళనలు తీవ్రం కాకుండా ఉండేలా దినేష్‌ కథ నడిపాడు. అందులో భాగంగా ‘నన్ను ఎవరూ ఏమీ చేయలేదు. మా అన్న దినేష్‌ చిత్రహింసలు పెట్టి కొట్టాడంటూ దళితులు ఆందోళన చేసి నన్ను ఇబ్బంది పెట్టాల్సిన పనిలేదు’ అంటూ జానకిరాం, రాజు కలిసి పవన్‌ చేత చెప్పించి ఆ వీడియో రిలీజ్‌ చేశారు.

ఆందోళన.. సుఖాంతం

రెండు రోజులుగా పవన్‌ కనిపించకుండా పోవడం.. సెల్‌ఫోను ఆఫ్‌.. ఆన్‌ చేస్తుండటం పోలీసులను, తల్లి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఇతడి ఆచూకీ కోసం ఎస్పీ హర్షవర్ధన రాజు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఇద్దరు సీఐలు ముమ్మరంగా గాలించారు. జానకిరామ్‌ ఫోను నెంబరు ట్రేస్‌ చేసి చిత్తూరులో ఉన్నట్లు శుక్రవారం గుర్తించారు. అలా లాడ్జీలో ఉన్న పవన్‌, జానకిరాంను పట్టుకుని తిరుపతి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో తనను చంపేస్తామని బెదిరించి మాట్లాడించారంని ఈ సందర్భంగా పోలీసులకు పవన్‌ వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురి అరెస్టు

ఈ కేసులోని నలుగురు నిందితుల్లో అనిల్‌కుమార్‌రెడ్డి, దినేష్‌, జగదీశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండుకు పంపారు. అజయ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. రిమాండ్‌లోని ముగ్గురు నిందితులను మళ్ళీ కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రాజు, జానకిరాం, మరో ఐదుగురి పేర్లు చార్జిషీటులో చేర్చనున్నట్లు తెలిసింది. వీరందరిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:25 AM