Share News

ప్రయాణికులు, కార్మికులు ప్రభుత్వానికి రెండు కళ్లు

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:08 AM

ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి రెండు కళ్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నూతనంగా నిర్మించిన డిస్పెన్సరీని ఆర్టీసీ చైర్మన్‌ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు.

ప్రయాణికులు, కార్మికులు ప్రభుత్వానికి రెండు కళ్లు
సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో డిస్పెన్సరీ ప్రారంభం

చిత్తూరు రూరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి రెండు కళ్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నూతనంగా నిర్మించిన డిస్పెన్సరీని ఆర్టీసీ చైర్మన్‌ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ బాగుంటుందన్నారు. ఇందులో భాగంగానే బస్టాండులోనే నూతన డిస్పెన్సరీని రూ.54 లక్షలతో నిర్మించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సును కూడా తీసుకురాలేక పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,400 నూతన సర్వీసులు తీసుకొచ్చిందని అన్నారు. జనాభాలో సగమైన మహిళల కోసం స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ కన్నా ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం చాలా బాగా అమలవుతోందన్నారు. తిరుపతిలో కూడా రూ.3.94 కోట్లతో డిస్పెన్సరీ, ఆర్టీసీ గెస్ట్‌హౌ్‌సను ప్రారంభించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అనంతపురం, నంద్యాల, హిందూపురంలో డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కార్మికులుల ఆరోగ్యంగా ఉంటే సంస్థ లాభాల్లో ఉంటుందన్నారు. స్ర్తీశక్తి పథకం అమలుకు సహకరిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఎంతో కాలంగా వేచి ఉన్న ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల కోసం బస్టాండులోనే డిస్పెన్సరీని ఏర్పాటు చేయించడంపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిస్పెన్సరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పూతలపటు ఎమ్మెల్యే మురళీమోహన్‌, వైస్‌ చైర్మన్‌ మునిరత్నం, ఆర్టీసీ జోనల్‌ మేనేజర్‌ నాగరాజు, చిత్తూరు డీపీటీవో రాము, చుడా చైర్‌పర్సన్‌ హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. డిస్పెన్సరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ఎమ్మెల్యే జగన్మోహన్‌ ఫొటో లేకపోవడంతో అధికారులపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ బ్యానర్‌ను తొలగించారు.

Updated Date - Nov 04 , 2025 | 01:08 AM