పిల్లల విషయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:01 AM
పిల్లల విషయంలో టీచర్లతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ అభిప్రాయపడ్డారు.
మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో ప్రముఖుల వెల్లడి
చిత్తూరు సెంట్రల్, జూలై 10(ఆంధ్రజ్యోతి): పిల్లల విషయంలో టీచర్లతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ అభిప్రాయపడ్డారు.జిల్లావ్యాప్తంగా గురువారం 2838 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. రొంపిచెర్లలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైళ్లకు దూరంగా ఉంచాలన్నారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే పీటీఎంకు తప్పక హాజరవ్వాలన్నారు.కాగా జిల్లావ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే వేడుకల్లో 3,23,365 మంది పాల్గొన్నారు. ఇందులో 2,07,621మంది విద్యార్థులు కాగా, 62,345 మంది తల్లిదండ్రులు, 7962 మంది టీచర్లు,1403మంది ప్రజాప్రతినిధులు ,11,561మంది స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు,1438మంది పూర్వ విద్యార్థులు ,1316మంది దాతలు ,1455మంది అధికారులు, 2047మంది స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా ప్రతి పాఠశాలలో పీటీఎం కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.బంగారుపాళ్యం హైస్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్, ఎస్‌ఆర్‌పురం మండలం మద్దికుప్పం స్కూల్లో డీఈవో వరలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రామకుప్పం మండలం వీర్నమల హైస్కూల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు సంతపేటలోని పీఎన్‌సీ హైస్కూల్లో ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముద, ఎస్‌ఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్ట జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే వీఎం థామస్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.