పంద్రాగస్టు వేడుకలకు పరేడ్ మైదానం ముస్తాబు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:49 AM
స్వాతంత్య్ర దిన వేడుకలకు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్ వద్ద వున్న పోలీసు పరేడ్ మైదానం సిద్ధమైంది.ఆహ్వానం పలుకుతూ మహిళా పోలీసులు పలువర్ణాల రంగవల్లులతో గ్రౌండును తీర్చిదిద్దారు.
మంత్రి సత్యకుమార్‌చే పతాకావిష్కరణ
343 మందికి ప్రశంసాపత్రాల ప్రదానం
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దిన వేడుకలకు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్ వద్ద వున్న పోలీసు పరేడ్ మైదానం సిద్ధమైంది.ఆహ్వానం పలుకుతూ మహిళా పోలీసులు పలువర్ణాల రంగవల్లులతో గ్రౌండును తీర్చిదిద్దారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రత్యేక అతిథులు, అవార్డుగ్రహీతలు, మహిళలు, ప్రజల కోసం వేర్వేరుగా సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చేశారు.ఏటా ఉదయం 9.05 గంటలకు ప్రారంభమయ్యే పతాకావిష్కరణ కార్యక్రమం ఈసారి అరగంట ముందుగానే ప్రారంభమౌతుంది. శుక్రవారం ఉదయం 8.35 గంటలకు పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించాక జిల్లా ప్రగతిని ప్రజలకు వివరిస్తారు. ఎంపిక చేసిన ఎనిమిది ప్రభుత్వ శాఖలచే అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ శకటాల ప్రదర్శన కొనసాగుతుంది.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. విధినిర్వహణలో ప్రతిభ కనబరచిన 343మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు బహూకరిస్తారు.వీరిలో పోలీసుశాఖకు చెందిన వారు 95మంది కాగా మిగిలిన శాఖల అధికారులు 248మంది వున్నారు.డీఆర్డీఏ, డ్వామా, వయోజన, గిరిజన సంక్షేమ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఆస్తులు పంపిణీ చేస్తారు.