పాలపుంత.. చిత్తూరు జిల్లా..!
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:00 AM
పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో సుమారు 1,11,168 కుటుంబాలు పాడిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రోజుకు 18 లక్షల నుంచి 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది.
వైసీపీ పాలనలో పాడి రైతులనూ కష్టపెట్టారు
నేడు ప్రపంచ పాల దినోత్సవం
పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో సుమారు 1,11,168 కుటుంబాలు పాడిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రోజుకు 18 లక్షల నుంచి 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా.. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాత్రం పాడి రైతులనూ కష్ట పెట్టారు. దీనివల్ల కొందరు పాడి రైతులు తమ ఆవులను తెగనమ్ముకోవాల్సి వచ్చింది.
- చిత్తూరు సెంట్రల్, ఆంధ్రజ్యోతి
జిల్లాలో 5,44,587 పశువులున్నాయి. వీటిలో పాడి ఆవులు 4,67,351, గేదెలు 1,736 ఉన్నాయి. ప్రసిద్ధి గాంచిన పుంగనూరు జాతి ఆవులతో పాటు దేశవాళీ, హలికర్, హెచ్‌ఎ్‌ఫ సంకర జాతి, జెర్సీ సంకర జాతి, గిర్ జాతి ఆవులున్నాయి. దేశవాళీ గేదెలతోపాటు గ్రేడెడ్ ముర్రా, ముర్రా జాతి గేదెలున్నాయి.
పాల ఉత్పత్తి, వినియోగం
జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో (మదర్ ఏజెన్సీగా చెప్పుకునే) ‘శ్రీజ’ పాలసంస్థ 31 మండలాల్లో 36 బల్క్ మిల్క్ సెంటర్లు నిర్వహిస్తోంది. 27వేల మంది పాడి రైతుల నుంచి రోజుకు 1.18 లక్షల నుంచి రూ.1.64 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం పాలు తిరుమలకు వెళుతున్నాయి. శాంతిపురం మండలం నుంచి అత్యధికంగా రోజుకు 1.20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి కాగా, పాలసముద్రం నుంచి అత్యల్పంగా 25వేల లీటర్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇదిలా ఉండగా అమూల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 80 సెంటర్ల నుంచి రోజుకు కేవలం 8వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఇంటి వాడకానికి 6 లక్షల నుంచి 9 లక్షల లీటర్ల వరకుపోగా, మిగిలిన పాలను ఫ్యాక్టరీల్లో పాల పదార్థాలకు తయారీలో వాడుతున్నారు.
పాలసముద్రం టు బెంగళూరు
పాలసముద్రం మండలంలో రోజువారీ పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నా, ఇక్కడి పాలకు మంచి గిరాకి ఉంది. ఈ మండలంలోని పాడి రైతులు ఎక్కువగా గిర్ జాతి ఆవులను పెంచుతారు. వీటి పాలు చిక్కగా, పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ మండలంలో ఉత్పత్తి అయ్యే 25వేల లీటర్లలో.. ఏకంగా 5-7వేల లీటర్లు బెంగళూరుకు తరలిపోతున్నాయి. లీటరు ధర ఏకంగా రూ.150, నెయ్యి కిలో ధర రూ.2 వేలు పలుకుతుండటం గమనార్హం.
పాడిని నాశనం చేశారిలా..
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలోని ప్రతి రంగాన్నీ ఛిద్రం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పాడి రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన శివశక్తి డెయిరీ సదుంలో ఉంటుంది. నియోజకవర్గంలోని పాడి రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ డెయిరీకే పాలను ఇవ్వాలని నియంతలా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. అలాగే చేయని రైతులకు భూ సమస్యలు సృష్టించి, సంక్షేమ పథకాలు అందకుండా చేసేవారని, బయటి ప్రాంతాల డెయిరీ వ్యానులు నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకునేవారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటితోపాటు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీఆర్‌డీఏ ద్వారా సోమల, చౌడేపల్లెలో ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ సెంటర్లనూ వైసీపీ హయాంలో రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది పాడి రైతులు తమ ఆవుల్ని అమ్ముకున్నారు.
పూర్తిగా గాడిలో పడలేదు
కూటమి ప్రభుత్వం వచ్చాక పుంగనూరు నియోజకవర్గంలోకి మిగిలిన డెయిరీ వ్యానులు పాల సేకరణకు వెళ్తున్నాయి. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ కూడా లీటరు మీద రూ.10 వరకు పెంచింది. అయినా ఇంకా గాడిలో పడలేదు. సోమల, సదుం, చౌడేపల్లె మండలాల్లో ఈ బల్క్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుంది. ఇక్కడ భవనాలుండగా.. మిషనరీ ఏర్పాటు చేస్తే సరిపోతుంది.
విజయా డెయిరీని కట్టబెట్టేసి మోసం
2019కు ముందు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా మాజీ సీఎం జగన్.. చిత్తూరుకు తలమానికమైన విజయా డెయిరీని పునరుద్ధరిస్తానన్నారు.. పాల ధరను పెంచి ఇన్సెంటివ్‌లు ఇస్తానని సదుంలో మాటిచ్చారు. ఏదీ నిలబెట్టుకోలేదు. పునరుద్ధరణ పక్కన పెడితే, విజయా డెయిరీని అమూల్ సంస్థకు చవకగా అప్పగించేశారు.
ప్రస్తుత ప్రభుత్వం చర్యలేవీ?
అమూల్ సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో 350 పాల సేకరణ కేంద్రాలను హంగామాగా ఏర్పాటు చేసింది. రోజుకు 65 వేల లీటర్లను సేకరించేది. కొంతకాలానికి 80 సెంటర్లకు కుదించి 8వేల లీటర్ల పాల సేకరణకు పరిమితమైంది. మిగిలిన పాలను తమిళనాడు ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. దీంతో జిల్లాలోని పాలరైతులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా ఈ విషయంగా చర్యలు తీసుకోలేదు.