పలమనేరు-కుప్పం ర హదారికి మహర్దశ
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:13 AM
రూ.1500 కోట్ల ప్రతిపాదనలతో విస్తరణకు డీపీఆర్
పలమనేరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పలమనేరు - కుప్పం రహదారి దశ మారనుంది. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు చేరువలో వున్న ఈ మార్గం తమిళనాడులోని కృష్ణగిరి వరకు వెళ్తోంది. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు రామకుప్పం సమీపంలో ఒక విమానాశ్రయం ఏర్పాటుకు కూడా భూ సేకరణ కార్యక్రమాలు ఊపందుకొని తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనల మేరకు కేంద్రం పలమనేరు నుంచి కుప్పం, కుప్పం నుంచి మన రాష్ట్ర సరిహద్దు వరకు మొత్తం 84 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్లకు విస్తరించేందుకు రూ.1500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. రహదారి విస్తరణ పనులకే కాక ఈ మొత్తం బైపాస్ రోడ్ల నిర్మాణానికి కావలసిన భూసేకరణకు పరిహారం చెల్లింపుల కోసం, ప్లైఓవర్ల నిర్మాణానికి వ్యయం చేస్తారని తెలిసింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు ఈ రహదారి విస్తరణ కోసం డీపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. డీపీఆర్ ప్రక్రియ పూర్తికాగానే టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టరుకు అప్పగించనున్నారు. వి.కోట, బైరెడ్డిపల్లె, రాజుపేటరోడ్డు, శాంతిపురం, కుప్పం వద్దకూడా బైపాస్‌రోడ్లు నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైరెడ్డిపల్లె, వి.కోట వద్ద బైపాస్‌రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు.బైరెడ్డిపల్లెలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తికాగా, వి.కోటలో ప్రజలు అభ్యంతరం చెబుతూ హైకోర్టులో స్టే కూడా తెచ్చినట్లు సమాచారం. రహదారి విస్తరణతో ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు. ఇప్పటికే పలమనేరు సమీపంలో బెంగళూరు నుంచి చెన్నె వెళ్లే ఎక్స్‌ప్రెస్ హైవే పనులు కూడా తుదిదశకు చేరుకుంటున్నాయి. బెంగళూరు నుంచి తిరుపతికి రైల్వేలైను ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. ఇది వాస్తవరూపం దాలిస్తే పలమనేరు వద్ద ఉన్న దాదాపు 700ఎకరాల పారిశ్రామికవాడలు కూడా అభివృద్ధి చెంది ఇక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.