పద్మావతి ఆస్పత్రి మెడికల్ షాపు మూత
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:30 AM
శ్రీపద్మావతి ఆస్పత్రి వద్ద నామమాత్రపు అద్దెతో గడువు తీరిపోయినప్పటికీ పొడిగింపుతో కొనసాగుతున్న వైసీపీ వర్గీయుల మెడికల్ షాపును టీటీడీ రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు.
- స్విమ్స్‌లో పులివెందుల పెత్తనానికి బ్రేక్
- టీటీడీనే సొంతంగా నిర్వహించేందుకు కసరత్తు
తిరుపతి - ఆంధ్రజ్యోతి
శ్రీపద్మావతి ఆస్పత్రి వద్ద నామమాత్రపు అద్దెతో గడువు తీరిపోయినప్పటికీ పొడిగింపుతో కొనసాగుతున్న వైసీపీ వర్గీయుల మెడికల్ షాపును టీటీడీ రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు. లాభాపేక్ష లేకుండా మెడికల్ షాపు నిర్వహించేలా టీటీడీ పాలకమండలి సమావేశంలో ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ హయాంలో స్విమ్స్ ఆస్పత్రిలో మొదలైన పులివెందుల పెత్తనానికి బ్రేక్ పడినట్లయింది.
మాఫియాకు షాక్
స్విమ్స్‌లో పద్మావతి జనరిక్ మెడికల్ షాపుతో పాటు గడువు తీరిన డాక్టర్ క్యాంటీన్‌ను కూడా మూసివేయించారు. టీటీడీ తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ సువర్ణ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది స్విమ్స్‌కు చేరుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలకు ఉపక్రమించారు. తొలుత స్విమ్స్ ఓపీ విభాగం వద్ద ఉండే షాపును రద్దు చేయగలిగారు గాని పులివెందుల చేతిలో ఉన్న పద్మావతి ఆస్పత్రి వద్ద ఉన్న మెడికల్ షాపును మాత్రం కదిలించలేకపోయారు. తొలుత కేవలం రూ17వేల నామమాత్రపు అద్దెతోనే దీనిని కేటాయించి, ప్రస్తుతం రూ.60వేలకు పెంచారు. దాదాపు రూ.20లక్షలు అద్దె అవకాశం ఉన్నప్పటికీ మాఫియా ఒత్తిళ్లతో కొనసాగిస్తూ వచ్చారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ నాలుగు సార్లు టెండర్లు పిలిచింది. మెడికల్ మాఫియా రింగుగా మారి షాపులు పంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. వీరు ఇంతకాలం కొనసాగడానికి రెవెన్యూ విభాగంలోని వైసీపీ వాసనలుపోని కొందరి సిబ్బంది ప్రమేయం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ నిర్ణయంతో మెడికల్ మాఫియా షాక్‌కు గురైంది.
టీటీడీ షాపునకు కసరత్తు
స్విమ్స్ యాజమాన్యమే మెడికల్ షాపును గతంలో నిర్వహించింది. 20 ఏళ్ల క్రితం పాత క్యాజువాల్టీ సమీపంలో మెడికల్ షాపును స్విమ్స్ ఆధీనంలోని సిబ్బందే నిర్వహించారు. ఆ తర్వాత రాజకీయ జోక్యం పెరగడంతో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. తాజాగా ఛైర్మన్ నిర్ణయంతో మళ్లీ స్విమ్స్ చేతికి ఫార్మశీ పగ్గాలు వెళ్లనున్నాయి.