ప్రజాప్రతినిధులకు పట్టని పీ4
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:02 AM
పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పీ4. పేదలకు సంపన్నుల చేయూత అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం. పేదలు ఆత్మన్యూనతకు గురికాకూడదనే ఆలోచనతో వీరికి బంగారు కుటుంబాలు అనే పేరు పెట్టారు.
బంగారు కుటుంబాల దత్తతకు ఒక్కరూ ముందుకు రాని వైనం
జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలు: 83,000
అత్యధికం గూడూరు నియోకవర్గంలో: 14,000
ముందుకొచ్చిన మార్గదర్శులు: 3330
దత్తత తీసుకోనున్న కుటుంబాలు: 19,546
తిరుపతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పీ4. పేదలకు సంపన్నుల చేయూత అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం. పేదలు ఆత్మన్యూనతకు గురికాకూడదనే ఆలోచనతో వీరికి బంగారు కుటుంబాలు అనే పేరు పెట్టారు. చంద్రబాబు మదిలో మెదిలిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ సారథ్యంలో అధికార యంత్రాంగం సవాలుగా స్వీకరించింది. బంగారు కుటుంబాలకు చేదోడుగా నిలిచే మార్గదర్శుల కోసం గట్టి ప్రయత్నమే జరిగింది. ఇప్పటికే 3330 మంది ముందుకొచ్చారు. 19,546 కుటుంబాలను అండగా నిలబడతామని సిద్ధపడ్డారు. అధికారులు, పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఎందరో ముందుకొచ్చినా.. విచిత్రంగా ఒక్క ఎమ్మెల్యే కూడా మార్గదర్శిగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించలేదు.
ఎంపిక ఇలా..
ఇదివరకే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో పాటూ వివిధ సర్వేల ద్వారా జిల్లాలోని నిరుపేద కుటుంబాలను గుర్తించారు. ఈ జాబితాను వేర్వేరు బృందాలతో పరిశీలించి నిర్ధారించుకున్నారు. వీరి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులు వంటి వివరాలు నమోదు చేసుకున్నారు. దత్తత ద్వారా వీరికి అండగా నిలువగలిగితే ఈ కుటుంబాలు నిలదొక్కుకుంటాయని అంచనా వేశారు.
ఏ నియోజకవర్గంలో ఎందరు?
సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో 12 వేలకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 11 వేలకు పైగా, వెంకటగిరి మూడు మండలాల పరిధిలో 7 వేలు, తిరుపతిలో 6 వేలు, నగరి రెండు మండలాల పరిధిలో 3 వేలు చొప్పున నిరుపేద కుటుంబాలను గుర్తించారు.
3330 మంది మార్గదర్శులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో కలెక్టర్ సైతం దీని అమలును సవాల్‌గా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ధనవంతులతో వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 7వ తేదీకి 5 మంది మార్గదర్శులు మాత్రమే ముందుకొచ్చి 1911 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అంగీకరించగా కలెక్టర్ చొరవతో ఈ సంఖ్య 3330కి చేరుకుంది. వారు 19,546 కుటుంబాలను దత్తత తీసుకోవడానికి అంగీకరించారు.
ఐదు షికారీ కుటుంబాలను దత్తత తీసుకున్న కలెక్టర్
ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్ ఐదు కుటుంబాల బాధ్యత తీసుకున్నారు. కలెక్టరేట్ పక్కనే ఉన్న షికారీ కాలనీ నుంచి ఈ కుటుంబాలను ఎంపిక చేసుకున్నారు. ఐదు కుటుంబాల్లో 18 మంది సభ్యులున్నారు. వారితో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పెళ్లయిన జంటలకు విడిగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావాలని వారు అడిగారు. అలాగే పిల్లల చదువులకు సాయం చేయాలని, జీవనోపాధికి ఆర్థిక సాయం కావాలని కోరారు. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడానికి నిర్ణయించిన కలెక్టర్.. ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువు, ఉపాధికి ఆర్థిక సాయం వంటి వాటికి దేశంలోనూ, విదేశాల్లోనూ వున్న తన స్నేహితులను సంప్రదించారు. వారు సాయం చేసేందుకు అంగీకరించారు.
సీఎం పిలుపిచ్చినా స్పందించని ప్రజాప్రతినిధులు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. సీఎం పిలుపుతో ప్రవాసాంధ్రులు సైతం స్పందించి మార్గదర్శులుగా మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచీ మాత్రం ఎలాంటి స్పందనా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు మూడు పర్యాయాలు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు. ఈనెల 19న స్వయంగా తిరుపతికి వచ్చి రెండు బంగారు కుటుంబాలకు చెందిన బాధితులను స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సదస్సులో మాట్లాడించి, వారిని దత్తత తీసుకున్న మార్గదర్శులను అభినందించారు. అయినా ప్రజాప్రతినిధులు ఎవరూ మార్గదర్శులుగా మారేందుకు, కనీసం ఒక నిరుపేద కుటుంబాన్ని అయినా దత్తత తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.