ఓజిలి తహసీల్దారు సస్పెన్షన్
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:50 AM
తప్పుడు నివేదిక ఇచ్చిన వీఆర్వో కూడా పీజీఆర్‌ఎస్ పిటిషన్ ఎఫెక్ట్
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ పిటిషన్‌కు సంబంధించి అధికారులను తప్పుదోవ పట్టించిన ఓజిలి తహసిల్దారు పద్మావతి, వీఆర్వో డిల్లయ్య సస్పెండయ్యారు. ఏం జరిగిందంటే.. ఓజిలి మండలం వీర్లగునపాడు గ్రామసర్వే నెంబరు 74లో ధనంజయ, వెంకటరమణయ్య తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని పీజీఆర్‌ఎ్‌సలో పిటిషన్ ఇచ్చారు. ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, పిటిషన్ తిరస్కరించకుండా తహసీల్దారు పద్మావతి ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఆ భూమి సరిగా తనిఖీ చేయలేదని అధికారులు సీరియస్ అయ్యారు. దీనికితోడు ఈర్లగునపాడు వీఆర్వో డిల్లయ్య సదరు సర్వే నెంబరులో భూమి బోగస్ అని, అక్రమంగా నమోదైందని జనవరిలో నివేదిక ఇచ్చారు. మళ్లీ జూన్‌లో ఆ భూమి వారి స్వాధీనంలో ఉందని.. మూడోసారి అక్టోబరులో ఈ ఎంట్రీలు అక్రమంగా ఉన్నాయని, అర్జీదారుల స్వాధీనంలో కాకుండా భూమి ఖాళీగా ఉందంటూ, ఇలా మూడుసార్లు విరుద్ధమైన నివేదికలు ఇచ్చారు. దీనిపై సీసీఎల్‌ఏ కమిషనర్ జయలక్ష్మి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దారు పద్మావతిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలక వెళ్లరాదని పేర్కొన్నారు. వీఆర్వోపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ఆదేశించగా, ఆయన్ను సస్పెండు చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’కి కలెక్టర్ తెలిపారు.